Viveka Murder Case :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు రెండు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య షాబానా మీద దాడి జరిగింది. ఇద్దరు వైసీసీ మహిళా కార్యకర్తలు తన మీద దాడికి పాల్పడ్డారని దస్తగిరి భార్య వెల్లడించింది. పులివెందుల నియోజక వర్గంలోని తొండూరు మండలం మల్యాల గ్రామంలో శనివారం సాయంత్రం తన మీద దాడి చేశారని తెలిపింది.


మల్యాల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లిన షాబానా మీద ఇద్దరు మహిళా కార్యకర్తలు ఇంట్లోకి చొరబడి ఉద్దేశ పూర్వకంగానే తనను బూతులు తిడుతూ దాడి చేశారని షాబానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 


దంపతులపై దుర్భాషలాడుతూ.. 
కొందరు మహళలు తన ఇంట్లోకి చొరబడి.. ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని షాబానా తెలిపారు. వాళ్లు అంతటితో ఆగకుండా ఏడాదిలోపు నీ భర్త దస్తగిరిని నరికేస్తామని ఇద్దరు వైసీపీ కార్యకర్తలు హెచ్చరించారని షాబానా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నీ భర్త మాట్లాడేంత ధైర్యం ఎక్కడికి వచ్చిందంటూ విచక్షణా రహితంగా కొట్టారని ఆమె తెలిపారు. అదే సమయంలో మరో ఇంట్లో ఉన్న దస్తగిరి సమాచారం అందుకుని వెంటనే ఘటనా స్థలానికి గన్ మెన్లతో వచ్చినప్పటికీ ఇద్దరు మహిళలు ఏ మాత్రం తగ్గకుండా దంపతుల ఇద్దరిపై ఇష్టానుసారంగా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  తొండూరు పులివెందుల రూరల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్లు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని షాబానా వాపోయారు. 
 
జగన్ మీద మాట్లాడే ధైర్యమా.. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడుతారా ?  అంటూ విచక్షణారహితంగా కొట్టారు. మల్యాల గ్రామానికి చెందిన శంషున్, పర్వీన్ లను ఎవరు పంపితే నా మీద దాడి చేశారో పోలీసులు తేల్చాలి. వివేకా వాచ్‌మెన్ రంగన్న చనిపోయిన తర్వాత నా భర్తను చంపాలని చూస్తున్నారు. సంవత్సరంలో చంపేస్తాము. ముక్కలు ముక్కలుగా నరికేస్తామన్నారు. జగన్, అవినాష్ రెడ్డిల మీద తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పోయి వచ్చిన తర్వాత హారతులు ఇస్తావా.. అంటూ నన్ను విచక్షణారహితంగా బూతులు మాట్లాడుతూ కొట్టారు. దస్తగిరిని చంపిన నాలుగేళ్ల తర్వాత  నన్ను చంపుతామన్నారు. ఇద్దరు మహిళలు పదే పదే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించారు. శనివారం సాయంత్రం ఘటన జరిగితే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు’’ అని షబానా ఆవేదన చెందారు.