AP Minister Payyavula Keshav gets grand welcome in Anantupur District | గుంతకల్లు: రాష్ట్ర మంత్రి అయినప్పటికీ తానెప్పటికీ అనంతపురం జిల్లాలకు కూలీవాడినే, సేవకుడ్నేనని పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి హోదాలో తొలిసారిగా అనంతపురం జిల్లాకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనంతపురం సరిహద్దులోని గుంతకల్లు నియోజకవర్గం గుత్తి నేషనల్ హైవే వద్ద మంత్రి పయ్యావుల కేశవ్ కాన్వాయ్ జిల్లాలోకి ఎంటర్ అయింది. అక్కడ గుత్తి నేషనల్ హైవే పక్కన ఉన్న బాట సుంకులమ్మ దేవాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్ కమ్
మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లాకు రాకను తెలుసుకున్న ఎమ్మెల్యేలు ముందుగానే అక్కడికి చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అని సురేంద్రబాబు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇతర టిడిపి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుత్తి నేషనల్ హైవే నుంచి ఉరవకొండ నియోజకవర్గం వరకు మంత్రి పయ్యావుల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రానికి మంత్రిని, మీకు మాత్రం కూలీవాడినే!
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా తనపై నమ్మకంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిపెద్ద బాధ్యతను అప్పగించారని చెప్పారు. గత ఐదేళ్లలో ఆర్థిక శాఖలో ఏం చేశారో పూర్తి స్థాయిలో తెలుసుకొని రాష్ట్రానికి అన్ని విధాల మేలు జరిగే విధంగా మంత్రిగా బాధ్యలు నిర్వహిస్తానన్నారు. రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి అయినా, తాను మాత్రం ఎప్పటికీ అనంతపురం జిల్లాకు కూలీవాడినే అన్నారు. టీడీపీ పార్టీపై, చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిపించిన జిల్లా ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించారు.
అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలను తీర్చేందుకు ప్రజా ప్రతినిధులు, మంత్రులం మీకు సేవకుల్లాగా పని చేస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అప్పులు పాలు చేసి, దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యతను తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు ఉంచారని, వారి నమ్మకం వమ్ము చేయకుండా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.