Sharmila Reddy Comments : ఏపీకి స్పెషల్  స్టేటస్ రాలేదు కానీ...స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం అమ్ముతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీలో 25 శాతం లిక్కర్ మరణాలు పెరిగాయని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ మరణాల శాతం చాలా ఎక్కువన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారన్న ఆమె... ఈ పాపం జగన్ ప్రభుత్వానిదేనన్నారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులు లేకపోవడం దారుణమన్న షర్మిలారెడ్డి.... ఇష్టం వచ్చిన ధరలకు మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో భూం భూం బ్రాండ్లు అమ్ముతున్నారని, నచ్చింది కాదు, వాళ్లు అమ్మింది.... చెప్పిన రేటుకి కొనాలన్నారు. 


నచ్చిన వాళ్ళకే మద్యం అమ్మకాల టెండర్లు
ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఓన్లీ క్యాష్ విధానం లేనే లేదన్న షర్మిలారెడ్డి...నచ్చిన వాళ్ళకే మద్యం అమ్మకాల టెండర్లు ఇస్తున్నారని ఆరోపించారు. వాళ్ళే అమ్మాలి, వాళ్ళు పెట్టిన రేట్లకే మద్యం విక్రయించాలన్నారు. మద్యం కల్తీపై కనీసం తనిఖీలు కూడా లేవన్న ఆమె...ఆంధ్రలో ఎంత మద్యం అమ్ముతున్నారో లెక్క లేదన్నారు. ఆడిట్ లేదు... తనిఖీలు లేవని, ఎంత ఆదాయం వస్తుందో తెలియదన్నారు. కేంద్రం నుంచి ఒక విచారణ కూడా జరగలేదన్నారు. కాగ్ రిపోర్ట్ లు లేవు... CBI దర్యాప్తు లేదన్న షర్మిల...ఇంత అవినీతి జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం కనీసం దర్యాప్తు కూడా చేయదన్నారు.  ఇచ్ఛాపురంలో పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని...అదే ఇచ్ఛాపురం నుంచి కాంగ్రెస్ పార్టీలో తన మొదటి ప్రస్థానం మొదలు పెట్టానన్నారు


గెలిచింది వైసీపీ... ఏలుతున్నది బీజేపీ
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేదన్న షర్మిలారెడ్డి...గెలిచింది వైసీపీ అయితే రాజ్యం ఏలేతున్నది మాత్రం బీజేపీ అని ఆరోపించారు. బాబు నుంచి జగన్ దాకా బీజేపీకి తొత్తులేనని... పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీకి బానిసలని విమర్శించారు. బీజేపీతో వైఎస్సార్ ఏనాడూ ఏకీభవించలేదని,వైఎస్సార్ జీవితం మొత్తం బీజేపీకి బద్ద వ్యతిరేకిగానే వ్యవహరించారని గుర్తు చేశారు. మత ఘర్షణలను రేపి చలి కాచుకునే తత్వం బీజేపీదన్న షర్మిలారెడ్డి... ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని అడిగిన చంద్రబాబు బీజేపీ క్యాబినెట్ లో చేరారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై దీక్షలు చేసిన జగనన్న...అధికారంలోకి వచ్చాక ఒక్కరోజు కూడా హోదా కోసం పోరాటం చేయలేదని గుర్తు చేశారు. 10 ఏళ్లలో ఒక్క నిజమైన పోరాటం లేదని, పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన బీజేపీ...దాని గురించి పట్టించుకోలేదన్నారు. 


విభజన హామీలు నెరవేర్చలేదు
విభజన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదని....కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వలేదన్నారు షర్మిలారెడ్డి. 25 మంది లోక్ సభ...6 మంది రాజ్యసభ ఎంపీలు ఉండి కూడా ప్రత్యే హోదా తేలేకపోయారని విమర్శించారు.  ఇంత మంది ఉండి ఎందుకు. .? మీకు అధికారం ఉండి ఎందుకు ? అని ప్రశ్నించారు. హోదా వచ్చి ఉంటే...పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవని, దాని ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఈ 10 ఏళ్లు రాజధానికి కూడా దిక్కులేదన్న షర్మిలా రెడ్డి...ఒకరు అమరావతి అన్నారని...మరొకరు 3 రాజధానులు అన్నారని విమర్శించారు. మన రాష్ట్ర భవిష్యత్ పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్ట్ పనులు 50 శాతం పెండింగ్ ఉంటే...జగనన్న పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, 8 లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు.