Anantapur Crime: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ వివాహితపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన పోలీస్ స్పందనలో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్త్రీ, శిశు శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ ఇలాకాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం కోడిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళపై ఈ నెల పదో తేదీ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చేసిన నీచపు పనిని వీడియోలు తీశాడు. 


వీడియోలతో బెదిరింపులు.. 
ఆపై ఆమెను బెదిరించడం ప్రారంభంచాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై లైంగిక దాడి చేసి వీడియోలు తీసి బెదిరిస్తున్నారంటూ స్థానిక ఎస్‌ఐకి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని ప్రాధేయపడింది. అక్కడ తన బాధను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలోనే తనకు న్యాయం జరుగుతుందని భావిచింది. ఈ క్రమంలో సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందనకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం గురించి జిల్లా పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీ ఎదుట కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ సుధాకర్ బాధితురాలిపై బెదిరింపులకు దిగాడు. 


దీనిపై స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం మండలం కోడిపల్లిలో దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.


ఇదే విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఎస్‌ఐ పిలిపించి విచారణ చేశారని, కేసు దర్యాప్తులో ఉండగానే బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కోడిపల్లి గ్రామానికి వెళ్లి పూర్తి విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తవగానే ఎస్పీకి నివేదికను ఎస్పీకి అందిస్తామన్నారు.


గ్యాంగ్ రేప్ కాదు, దుష్ప్రచారం.. 
కొన్ని మీడియా ఛానల్లో గ్యాంగ్ రేప్ అంటూ ప్రచారం జరుగుతోందని, అటువంటి వాటిలో వాస్తవం లేదన్నారు. పూర్తి వివరాలు తెలియకుండా అసత్యవార్తలు ప్రచారం చేయడం తగదన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.