విజయనగరం: ఉగ్రవాద కదలికలతో విజయనగరం ఉలిక్కిపడింది. హైదరాబాదులో వరుస పేలుళ్లకు ప్లాన్ చేసిన విజయనగరం యువకుడు సిరాజ్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ తో పాటు  హైదరాబాదు(Hyderabad)లో ఉండే సమీర్ అనే  యువకుడిని అరెస్ట్ చేయడంతో హైదరాబాద్ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది.

కలిసి చదివారు... కలిసే బాంబులు పేలుద్దామనుకున్నారు 

 పోలీస్ వర్గాల సమాచారం మేరకు  విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాదులోని బోయ గూడలో ఉండే సయ్యద్ సమీర్ అనే యువకులు 2018లో హైదరాబాదులో కలిసి చదివారు. తర్వాత వారు తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారని ఇద్దరూ కలిసి "ఆల్ హింద్ ఇత్తయ్ హాదుల్ ముస్లిమీన్" అనే సంస్థను నడుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గమనించాయి. వీరికి సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేసే  పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్టు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్  వీరిపై దృష్టి పెట్టింది.

ముఖ్యంగా విజయనగరంలో నుండే పేలుళ్లకు సిరాజ్ కుట్రపన్నినట్టు గుర్తించారు. ముందుగా కొన్ని డమ్మీ పేలుళ్లుతో ప్రయోగం చేసి తర్వాత హైదరాబాద్ లో వరుస పేలుళ్ళు జరపాలని వీరు కుట్రపన్నినట్టు సమాచారం. దీనికోసం పేలుడుకు అవసరమైన సల్ఫర్, అమ్మోనియా లాంటి పదార్థాలను ఆన్లైన్లో సిరాజ్ సేకరించినట్టు గుర్తించారు. గత కొన్ని నెలలుగా  సిరాజ్ సమీర్ కదలికలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ సంస్థలు పక్కా సమాచారంతో విజయనగరంలో సిరాజ్ ను హైదరాబాద్లో సమీర్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సమీర్ ను విజయనగరం తరలించారు. 

ఐసిస్ తో లింకులు?

 ఈ ఇద్దరికీ  భయంకర ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) తో లింకులు ఉన్నాయా అని కోణం లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వీరికి సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు ఇచ్చిన  హ్యాండ్లర్ ను గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. హైదరాబాదులో పేలుడు పదార్థాలు కొంటే  దొరికిపోతామని భావించి  విజయనగరం నుండి ఆపరేషన్ ను సిరాజ్,సమీర్ ప్లాన్ చేసినట్టు ప్రాథమికంగా తేలింది. వీరిద్దరి అరెస్టుతో  ఒక భారీ కుట్రకు తెరపడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు  తెలియాల్సి ఉంది.