Nandigam Suresh Arrest: టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్
Andhra Pradesh News | వైసీపీ నేత నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో అరెస్ట్ చేశారు.
గుంటూరు: వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టిడిపి కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేసిన కేసు లో నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెంలో మే 17న రాత్రి నందిగామ సురేష్, ఆయన సోదరుడు, బంధువులు కలిసి టిడిపి కార్యకర్త రాజు పై దాడి చేశారు. బాధితుడు రాజు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్దండరాయునిపాలెం వెళ్లి మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను అరెస్టు చేశారు.
అసలేంటీ వివాదం..
Just In
గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోకి శనివారం రాత్రి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అతివేగంగా వెళ్లడంపై టీడీపీ కార్యకర్త రాజు కారు డ్రైవర్ ను మందలించాడు. కొంత సమయానికి అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చి రాజు మీద దాడి చేశారు. అనంతరం వారు రాజును అక్కడినుంచి బలవంతంగా నందిగాం సురేష్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మరోసారి మాజీ ఎంపీతో పాటు అతడి సోదరుడు ప్రభుదాసు, సన్నిహితులు టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేశారు. గాయపడ్డ రాజును కుటుంబసభ్యులు మంగళగిరిలోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేపిస్తున్నారు. తనపై దాడి చేసింది నందిగాం సురేష్, ఆయన అన్న, బంధువులు అని చెప్పగా.. బాధితుడు రాజు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రాజుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నందిగాం సురేష్ ను అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ సోదరుడు ప్రభుదాసు, బంధువుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.