AP liquor case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి ఇచ్చింది. గతేడాది ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్టు దగ్గర పట్టుబడ్డ రూ.8.36 కోట్లు, రాజ్ కెసిరెడ్డి ఆధీనంలో కొనసాగిన అదాన్ డిస్టిలరీస్ ఖాతాలోని రూ.16.12 కోట్లు, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఖాతాలోని రూ.5 కోట్లు, ఎంపీ డిస్టిలరీస్ ఖాతాలోని రూ.50 లక్షల జప్తు కోసం కోర్టులో పిటిషన్ సిట్ పిటిషన్ వేసింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో అక్రమ సొమ్ము ఎటాచ్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు.? ఎక్కడికి చేర్చారు.? ఎలా తరలించారు.? అనే కీలక అంశాలన్నింటినీ సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించినట్లుగా చెబుతున్నారు.
మరో వైపు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఎదుట నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ విచారణకు హాజరయ్యారు. తనతో పాటు తన హెల్త్ కండిషన్ కు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా ఆయన సిట్ విచారణకు హాజరుకాలేనని సమాచారం పంపించారు. తన ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. అయినప్పటికీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని సిట్ స్పష్టం చేయడంతో ఆయన విచారణకు హాజరయ్యారు.
ఎక్సైజ్ శాఖను ప్రైవేటు వ్యక్తులకు వదిలేసినట్లుగా రజత్ భార్గవైప ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి డిస్టిలరీస్ లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వడం, ఎక్సైజ్ శాఖలో రాజ్ కసిరెడ్డి పెత్తనం, కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం, సత్య ప్రసాద్ అనే ఒక ఎక్సైజ్ అధికారికి అన్ని పనులు అప్పగించడం, ఆదాన్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ల గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రిటైల్ అవుట్‌లెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో సత్య ప్రసాద్ ద్వారా డిపో మేనేజర్లు పెడుతుంటే రజత్ భార్గవ పట్టించుకోలేదు. అనూష అనే మహిళను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం స్పెషల్ మెమో నియమించారు. ఆమె వివరాలన్నీ బయటకు పంపినట్లుగా గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.
లిక్కర్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. త్వరలో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈడీ కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసింది. త్వరలో.. ఈడీ అరెస్టులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సిట్ అసలు అంతిమ లబ్దిదారు దగ్గరకు కేసును చేర్చేందుకు ఇప్పటికే రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వందల కిలోల బంగారం కొనుగోలు చేశారని.. వాటి గురించి మొత్తం తెలుసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముందు ముందు లిక్కర్ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పై పిటిషన్ వాయిదా పడింది. తదుపరి విచారణ వరకూ ఆయనపై కఠినచర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.