Kurnool News : కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే జరదోడ్డి సుధాకర్ కు అడుగడుగున ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలపై మహిళలు, విద్యాదీవెన రాలేదని విద్యార్థులు, పిల్లల నిరుద్యోగ సమస్య, ఒక్క ఫ్యాక్టరీ కూడా కర్నూలు జిల్లాకు తీసుకురాలేదని తల్లిదండ్రులు నిలదీశారు. నిత్యవసర సరుకులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. కరోనా ఉన్నందున విద్యాదీవెన పడలేదని చెప్పి ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేలకు నిరసన సెగ
గడపగడప కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రుల నుంచి ఎమ్మెల్యేలకు కూడా నిరసన సెగ తగులుతోంది. వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాల కాలవ్యవధి గడిచిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలలో కొన్ని పథకాలను అమలు చేస్తూ మరికొన్నింటిని విస్మరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలు వారి సంక్షేమం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఓటు బ్యాంకు కోసం అనేక రకాలుగా పార్టీ క్యాడర్ ప్రజలకు వెళ్తుందని వివిధ పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన.
గడప గడపలో ప్రశ్నలు
జిల్లాలో ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు తమ క్యాడర్ ను వెంటపెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వ పథకాలు అందనివారు గడప గడప అంటూ వస్తున్నటువంటి నాయకులకు ఒక గడప నుంచి ఇంకొక గడపకు దాటనివ్వకుండా ఎక్కడికి అక్కడ నిలదీస్తున్న సందర్భాలు ఎక్కువనే ఉన్నాయి. అక్కడున్నటువంటి నాయకులతో మాట్లాడుతూ వీరికి ఈ సమస్యలు ఉన్నాయి వీటిని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యేలు అధికారులను కోరుతున్నారు. కొందరైతే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో తీసుకుంటున్నట్టుంది ఈ ప్రభుత్వ వ్యవహారం అంటూ ఎమ్మెల్యేలపై ప్రజలు మండిపడుతున్నారు.
మంత్రి బుగ్గనను నిలదీసిన మహిళ
మొన్నటికి మొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికు డోన్ లో ఒక మహిళ తమ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు డబ్బులు పంచుతూ నిత్యవసర సరుకులు ధరలు పెంచి కుటుంబాలపై పెను భారం మోపుతున్నారని ఆరోపించింది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో ఒకటి లేదా రెండు సంవత్సరాలు వాటిని అమలు చేసి తర్వాత వాటిని ఏదో ఒకటి లేదంటూ చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ ప్రభుత్వ పథకాలను దూరం చేస్తున్నారని మహిళా మంత్రి బుగ్గన వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సుధాకర్ కు నిరసనసెగ
కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ పర్యటన సందర్భంగా ఓ మహిళ నుంచి మాకు ఎటువంటి రత్నం రావడం లేదని, ఎటువంటి అమ్మబడి వస్తలేదు. మాకు ముగ్గురు పిల్లలు ఉన్నా ప్రభుత్వం నుంచి పిల్లలకు అందవలసినటువంటి పథకాలు వర్తించడం లేదంటూ ఫీజు రీయింబర్స్మెంట్ ను కూడా కోల్పోయామని వాపోయారు. తమకు సొంత కారు ఉందని తమ ఆస్తులను ఎక్కువగా చూపించి వివిధ రకాలైన పథకాలను దూరం చేస్తున్నారని భార్యభర్తలు ఇద్దరూ ఎమ్మెల్యే కు వివరించారు. వైయస్సార్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మేము దగ్గర ఉండి ఓట్లు వేయిస్తే మాకే అన్యాయం చేస్తారా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
Also Read : AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !