AP News: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్ తప్పదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. రెండు రోజుల నుంచి తిప్పలు పడుతున్న ఉపాధ్యాయ సంఘాలను ఆయన చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగ ఫోన్లలో ఫేస్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోలేమని.. అది డేటా సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రతి ఒక్కరిగా అటెండెన్స్ రిజిస్టర్ కోసం డివైస్‌లు ఇవ్వాలన్నారు. చాలా చోట్ల సిగ్నల్ ఉండటం లేదని దానికీ పరిష్కారం చూపాలన్నారు. అలాగే వివిధ రకాల యాప్‌ల వాడకంలో వస్తున్న ఇబ్బందుల గురించి వివరించారు. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఫేస్ యాప్‌ను వినియోగించి తీరాలని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్
ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే కాదని.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలో ఫేస్ యాప్ అటెండెన్స్ అమలు చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో ముఖ ఆధారిత యాప్‌పై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ఫోన్లను వాడటం తమకు సాధ్యం కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. సొంత ఫోన్లు వాడాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని బొత్స చెప్పారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పదిహేను రోజుల తర్వాత మళ్లీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ‘‘అన్ని ప్రభుత్వ శాఖల్లో యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారు. అందరికీ సెల్ ఫోన్లు కొనివ్వాలంటే.. రూ. 200 కోట్లు ఖర్చవుతుందన్నారు. మా ఫోన్ల ద్వారానే యాప్ వాడాలని’’ చెప్పారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
డివైజ్‌లు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయులు
రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తొలిరోజే ఈ ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోంది. '' మేం విద్యార్ధులకు పాఠాలే చెప్పాలా..యాప్ లతో కుస్తీ పట్టాలా'' అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. యాప్ అటెండెన్స్ విధానం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. యాప్ డౌన్‌లోడ్‌కు తోడు.. ఫొటో అప్‌లోడ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
మరోసారి సమావేశం అవుదామని చెప్పిన బొత్స
నెట్ లేక కొంతమంది, స్మార్ట్స్ ఫోన్స్ లేక ఇంకొంత మంది ఈ యాప్‌తో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.. డౌన్‌లోడ్ ప్రాబ్లమ్, నెట్ వర్క్ ప్రాబ్లెమ్ తో ఏం చేయాలో తెలియక టీచర్స్ తలాలు పట్టుకుంటున్నారు. గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పడేసి.. ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఈ యాప్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ విధులను బారు కాట్ చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. మంత్రితో జరిగిన చర్చల్లోనూ స్పష్టత లేకపోవడంతో తదుపరి ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తాయన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.