గ్యాస్, నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో కూడా కేవలం పది రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు ఓ హోటల్ నిర్వహకులు. పది రూపాయలకే రుచికరమైన ఇడ్లీ, వడ, దోశ, పూరీ, ఉగ్గాని అందిస్తున్నారు. పది రూపాయలకు టీ దొరకడమే కష్టంగా ఉంటే ఈ హోటళ్లో మాత్రం టెన్ రూపీస్ కే టేస్టీ టిఫిన్ ఇస్తున్నారు. ఇక్కడ టిఫిన్ రుచికరంగా ఉండటంతో జనం క్యూ కడుతున్నారు. పదేళ్ల నుంచి పది రూపాయలకే టిఫిన్ అందిస్తున్న హోటల్ యజమానికి ఇటీవల ఓ సంస్థ అవార్డుతో సత్కరించింది.
Also Read: మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..
ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు
ప్రజలకు రుచికరమైన అల్పాహారం అందిచాలన్న సంకల్పంతో కర్నూలులోని రోజావీధిలో రేణుక దేవీ టిఫిన్ సెంటర్ ను నాగేశ్వర రెడ్డి, అతని మామ ప్రారంభించారు. అయితే కొద్ది రోజులకు నాగేశ్వర రెడ్డి మామ వేరే బిజినెస్ కు వెళ్లడంతో హోటల్ బాధ్యతలన్నీ నాగేశ్వరరెడ్డి చూసుకుంటున్నారు. ప్లేట్ ఇడ్లీ, వడ, దోశ, పూరీ, మైసూర్ బొండా, ఉగ్గాని పది రూపాయలకే అందించాలని నాగేశ్వరరెడ్డి నిర్ణయించారు. ఉగ్గానితో పాటు బజ్జీ కావాలంటే మరో ఐదు రూపాయలు అదనం. గ్యాస్, నూనె, కూరగాయల ధరలు పెరిగినా పది రూపాయలకే టిఫిన్ అందించడం ఈ హోటల్ విశేషం. హోటల్ వ్యాపారంలో ఆర్థికంగా ఎన్ని ఆటు పోట్లు ఎదురైనప్పటికీ తక్కువ రేటుకు మంచి రుచికరమైన అల్పాహారం అందిస్తున్నందుకు ఏపీ క్యూర్స్ హాస్పిటాలిటీ సంస్థ నాగేశ్వరరెడ్డికి ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డుతో సత్కరించింది.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
పదేళ్ల నుంచీ ఇదే ధర
రేణుకా దేవీ టిఫిన్స్ టేస్టీగా ఉండటంతో తెల్లవారగానే జనం ఈ హోటల్ దగ్గర క్యూ కడతారు. పేద, మధ్యతరగతి జనాలతో పాటు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, చుట్టు పక్కల ఉండే దుకాణాదారులతో ఈ హోటల్ కిటకిటలాడుతుంది. హోటల్ నిర్వహకుడు నాగేశ్వర రెడ్డి అందించే టిఫిన్స్ అన్నీ చాలా బాగున్నాయని, పదేళ్ల నుంచి ఇక్కడే అల్పాహారం తింటున్నామని నగర వాసులు సంతోష వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !
నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో టిఫిన్ చేసుకోవాలన్నా ఇరవై రూపాయలకు పైనే అవుతుంది. ఆలాగే నగరంలోని బయట హోటల్స్ లో రుచికరమైన టిఫిన్ చేయాలన్నా 30, 40, 50 రూపాయలు ఖర్చవుతుంది. కానీ రోజా వీధిలోని రేణుకాదేవీ హోటల్ లో మాత్రం పది రూపాయలకే టిఫిన్ దొరకడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు నిత్యావసర సరకులు, గ్యాస్, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పది రూపాయలకే టిఫిన్ అందించడం ఎలా సాధ్యమని ఇతర ప్రాంతాలకు చెందిన హోటల్ నిర్వాహకులు ఆశ్చర్యానికి గురవుతూ రేణుకా దేవి టిఫిన్ సెంటర్ ను సందర్శించి వ్యాపారం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
Also Read: చంద్రబాబును ఏడిపించిన "ఆ నలుగురి"కి సెక్యూరిటీ పెంపు.. !