Kukkala Vidyasagar arrested in Dehradun in heroine Jethwani case : హీరోయిన్ జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. జెత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైన తర్వాత ఆయన పరారాయ్యారు. తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. తన స్నేహితుడి ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ పై నిఘా పెట్టిన పోలీసులు ఆయన డెహ్రాడూాన్ లో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకు వస్తున్నారు.
గత ఫిబ్రవరిలో ముంబై నటి జెత్వానీ అరెస్ట్
ముంబైకి చెందిన హీరోయిన్ జత్వానీని గత ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. తన పొలాన్ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించిందని.. వేరే వ్యక్తి దగ్గర ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చి రూ. ఐదు లక్షలు తీసుకుని ఒప్పందం చేసుకుందని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పెద్ద ఎత్తున పోలీసుల టీం మంబై వెళ్లింది. రెండు రోజుల పాటు నిఘా పెట్టి ఆమె కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. చిన్న చిన్న నేరాల్లోనే ప్రెస్ మీట్లు పెట్టే పోలీసులు ముంబైలో టెర్రరిస్టు తరహాలో అరెస్టు చేసి తీసుకు వచ్చిన హీరోయిన్ జత్వానీ విషయాన్ని మాత్రం బయటకు తెలియనివ్వలేదు. దాదాపుగా నెలన్నర తర్వాత ఆమెకు బెయిల్ రావడంతో ముంబైకి వెళ్లారు.
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ప్రభుత్వం మారిన తర్వాత తనపై వేధింపుల విషయాన్ని బయట పెట్టిన నటి
ప్రభుత్వం మారిన తర్వాత ముంబై నటిని విజయవాడ పోలీసులు వేధించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ఈ వార్తలు రావడంతో.. ముంబై నటి జత్వానీ స్పందించారు. విజయవాడ పోలీసులు తన విషయంలో వ్యవహరించిన విధానాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తర్వాత విజయవాడకు వచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసులు.. జత్వానీ పై కేసు పెట్టక ముందే .. అరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేశారని గుర్తించారు. అలాగే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు కూడా తప్పుడుదేనని గుర్తించారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో .. పొలాన్ని అమ్మకానికి పెట్టిందని చెప్పిన వ్యక్తులు .. తమకు అసలు జత్వానీనే తెలియదని పోలీసులకు చెప్పారు.
తమకు జత్వానీ తెలియదని.. తమకు పొలం అమ్మకానికి పెట్టలేదని.. తాము ఎవరికీ డబ్బులివ్వలేదన్నారు. శ్రీవారి దర్శనం కోసం టిక్కెట్లు ఇప్పిస్తామంటే తమ ఆధార్ కార్డులు కుక్కల విద్యాసాగర్ అడిగితే ఇచ్చామని .. అంతకు మించి తమకేమీ తెలియదన్నారు. అలాగే పోలీసులు ఫిర్యాదులో .. జెత్వానీ ఫోర్జరీ చేసిందని చెబుతున్న డాక్యుమెంట్ ను కూడా ఇక్కడే తయారు చేశారని గుర్తించారు. దీంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కుక్కల విద్యాసాగర్ ను ప్రశ్నించిన తర్వాత వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.