Kotamreddy Issue : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మిత్రుడితో జరిపిన ఫోన్ సంభాషణ ట్యాప్ అయిందని.. తనపై నిఘా పెట్టారని చేసిన తీవ్ర ఆరోపణలను ఆయన మిత్రుడు లంకా రామ శివారెడ్డి ఖండించారు. ఈ అంశం దుమారం రేగినప్పుడే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లంకా రామశివారెడ్డితోనే అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని చెప్పిస్తామని ప్రకటించారు. ఇది జరిగిన దాదాపుగా వారం రోజుల తర్వాత .. కోటంరెడ్డి మిత్రుడు మీడియా ముందుకు వచ్చి అది ట్యాపంగ్ కాదని.. రికార్డింగేనని ప్రకటించారు. కోటంరెడ్డి చెప్పినట్టు తనది ఐ ఫోన్ కాదని, ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమేనని చెప్పారు. అందులోనూ ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యే అవకాశం ఉండటంతో ఆరోజు ఆ కాల్ రికార్డ్ అయిందని చెప్పారు.
తన ఫోన్ నుంచి కోటంరెడ్డితో మాట్లాడిన ఆడియో ఓ కాంట్రాక్టర్ కు షేర్ అయిందని ఆయన దగ్గర నుంచి ఎవరికి వెళ్లిందో తెలియదన్నారు. తన ఫోన్‌లో ఆటోమేటిగ్గా ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందని.. కావాలంటే కేంద్ర హోంశాఖ, సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. తన వెనుక ఎవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడటం ఇష్టం లేకనే స్వచ్ఛందంగా వచ్చి నిజం చెబుతున్నానని రామశివారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను తెరపైకొచ్చానన్నారు.
ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టుగా ప్రకటించారు. బుధవారం నాడు శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అమిత్ షా కు రాసిన లేఖను మీడియాకు చూపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబితే తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను తిట్టడమే పనిగా వైసీపీ నేతలు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కోటంరెడ్డి తాను నేరుగా కేంద్ర హోంశాఖ అధికారుల్ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇలా చెప్పిన కొద్ది సేపటికే కోటంరెడ్డి మిత్రుడు తెరపైకి వచ్చి అది ట్యాపింగ్ కాదని... రికార్డింగ్ అని ప్రభుత్వానికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశం అయింది.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. చివరికి కోటంరెడ్డి పార్టీ మారే పరిస్ధితికి చేరుకుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జీ పదవి నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించింది ఆ పార్టీ. మాజీ మంత్రి, ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జీగా నియమించింది. దీంతో అదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అది ట్యాపింగ్ కాదని రికార్డింగేనని వైసీపీ నేతలు మొదటి నుంచి గట్టిగా వాదిస్తున్నారు. అది రికార్డింగ్ అయినందున విచారణ కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అది ట్యాపింగేనని... విచారణ జరిపిస్తేనే కదా అన్ని విషయాలు తెలుస్తాయని కోటంరెడ్డి అంటున్నారు.