కొండపల్లి అభయారణ్యంలో గ్రావెల్ తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లేందుకు తెదేపా నిజనిర్ధారణ కమిటీ సిద్ధమైంది. కానీ ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. అనుమతి ఇవ్వాలని, తమతో పాటు అధికారులను పంపాలని తెదేపా నేతలు కృష్ణా జిల్లా కలెక్టర్ ను కోరినా, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని నేతలు చెబుతున్నారు. మరోవైపు తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి గృహనిర్బంధం చేస్తున్నారు. కమిటీలోని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను విజయవాడలోని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్‌బాబును, విజయవాడలో బోండా ఉమా, ఒక హోటల్‌లో వంగలపూడి అనిత, నాగుల్ మీరాను, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకొళ్ల నారాయణ,నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాంలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, నేతలు నెట్టెం రఘురామ్, కొనకళ్ల నారాయణరావు తదితరులు శుక్రవారం విజయవాడలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్‌ను కలిసి అటవీ ప్రాంతంలో తవ్వకాలపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు అనుమతివ్వాలని వినతిపత్రం అందించారు. కొండపల్లి అభయారణ్యంలో భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయని, అటవీశాఖ కేసులు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదని, ఆ ప్రాంత పరిశీలనకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఈ రోజు అక్కడికి వెళ్తున్నామని వారు కలెక్టర్ కు తెలిపారు. గనులు, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను పంపించాలని కోరారు. అధికారులు రాకపోయినా తమ బృందం పరిశీలించేందుకు అనుమతించాలని కలెక్టర్ ను కోరారు.
అధికారులను తమతో పంపాలని కోరామని, శనివారం విజయవాడ నుంచి బయల్దేరే ముందు అధికారుల కోసం వేచి చూస్తామని తెదేపా నేతలు తెలిపారు. అధికారులు వచ్చినా, రాకపోయినా నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు వెళ్తుందన్నారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ గనుల తవ్వకాలను ఉపేక్షించడం చూస్తే ప్రభుత్వ పెద్దలకు ఏదో అందుతున్నట్లు ఉందని మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఆరోపించారు.
ఉమాకు ప్రాణహాని ఉంది : అచ్చెన్న
మాజీ మంత్రి దేవినేని ఉమాకు ప్రాణహాని తలపెట్టేందుకే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉమాకు ఎలాంటి హాని జరిగినా వైకాపా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీ వెనుక కుట్రకోణం ఉందన్నారు. బదిలీపై వివరణ ఇవ్వాలని కోరారు.
ఇంటికి తాళం వేశారు : నక్కా ఆనందబాబు
వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇంట్లోకి వచ్చి అడ్డగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పని ఉంది, బయటకు వెళ్లాల్సి ఉన్నా ఇంటికి గడియ పెట్టి తాళం వేస్తున్నారని ఆరోపించారు. కొండపల్లికి వెళ్తామని అడ్డుకుంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరతామని ముందస్తు అరెస్టులు చేస్తున్నారంటే కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒప్పుకుంటున్నారా అని నక్కా ఆనందబాబు ఆరోపించారు.
ప్రజలకు భద్రత ఏది : లోకేశ్
వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైకాపా ఎమ్మెల్యే బహిరంగంగా మాజీ మంత్రి దేవినేని ఉమాను బెదిరిస్తున్నా, పోలీసుల ముందే ఆయనకు హాని తలపెట్టారంటే, సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
అసలు ఏంజరిగిందంటే....
కొండపల్లి అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు, కనీసం ఎంత గ్రావెల్ తవ్వేశారో లెక్కలు లేవని, తవ్విన లీజుదారులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. గనుల శాఖ, అటవీశాఖ చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొండపల్లి బొమ్మల తయారీకి కీలకమైన పునికి చెట్టు ఉనికిని కోల్పోయేలా తవ్వకాలు జరిపినా చర్యలు లేకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. తవ్వకాలకు మీరే కారణమంటూ అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడిక్కింది. అదే వివాదంగా మారి మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసుల నమోదుకు దారితీసింది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. కొండలను తొలిచి కంకర, గ్రావెల్ తరలించిన వైనం గత సంవత్సరం ఆగస్టులో బయటపడింది. అటవీశాఖ అధికారులు 8 జేసీబీలు, 7 టిప్పర్లను స్వాధీనపరుచుకుని, కేసు నమోదు చేశారు. జి.కొండూరు మండలంలో కడెంపోతవరం, లోయ గ్రామాల పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో ఉన్న గ్రావెల్, కంకర తవ్వకాలు జరిగాయి. కడెంపోతవరం గ్రామంలో లీజుకు ఇచ్చిన ప్రాంతం అడవిగా ఉన్నా రెవెన్యూ శాఖ ఎన్‌వోసీ జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి లీజులను జిల్లా సంయుక్త కలెక్టర్ రద్దు చేశారు. నాటి నుంచి గనుల శాఖ అనుమతులు లేవు. గతేడాది మళ్లీ తవ్వకాలు జోరందుకున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. తర్వాత ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దేవినేని అరెస్టు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలు మంగళవారం సాయంత్రం క్వారీ ప్రాంతాలను పరిశీలించి తిరిగి వస్తుండగా కొందరు రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడే తవ్వకాలు జరిగాయని మైలవరం ఎమ్మెల్యే, వైకాపా ప్రభుత్వం వచ్చాకే మొదలయ్యాయని ఉమా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ దాడి విషయంపై పోలీసులు కేసులు నమోదు చేసి అనంతరం దేవినేని ఉమాను అరెస్టు చేశారు.
అక్రమ మైనింగ్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలి : చంద్రబాబు
దేవినేని ఉమాపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా నాయకులే దాడి చేసి తిరిగి కేసు పెట్టారన్నారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని కుటుంబసభ్యులను చంద్రబాబు నేడు పరామర్శించారు. ఎస్సీలపై దాడి చేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారని, కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కొట్టేస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదని, దేవినేని ఉమాపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
Also Read: Jagan Congress PK: కాంగ్రెస్ కూటమిలోకి వైఎస్ఆర్‌సీపీ..! పీకే మధ్యవర్తిత్వం..?