ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ప్రశాంత్ కిషోర్ మరోసారి ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడమే దీనికి కారణం అనుకోవచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ నేరుగా ఈ సారి ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు . జాతీయ  రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఏపీ పార్టీలను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ముందుగా తన పాత క్లయింట్ జగన్‌పైనే దృష్టి పెట్టారన్న ప్రచారం ఊపందుకుంది. 


కాంగ్రెస్ కూటమిని బలోపేతం చేస్తున్న ప్రశాంత్ కిషోర్..! 


పీకే ప్రస్తుతం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా విపక్ష పార్టీలన్నీ అంగీకరిస్తే వాటి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపారు. ఇప్పటికే అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కూటమిని బలోపేతం చేసే దిశగా ఆయన ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పీకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశారు.  జగన్మోహన్ రెడ్డికి పీకే వ్యూహాల మీద మంచి నమ్మకం ఉంది.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీకే సంస్థ ఐప్యాక్‌కు చెందిన కొంత మందికి ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు ఇచ్చారు.  


ఓ కీలక ఎంపీతో  మూడు గంటల పాటు పీకే చర్చలు..! 


ఇప్పుడు ప్రశాంత్ కిషోర్.. జగన్మోహన్ రెడ్డిని ఈ పరిచయాలతోనే ప్రభావితం చేసి కాంగ్రెస్ కూటమిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశంపై  వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ఢిల్లీలో వ్యవహారాలుచక్క బెడతారని పేరుతున్న ఓ కీలకమైన ఎంపీతో ఆయన మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం...  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం అనేసంగతిని పీకే  గుర్తు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తమపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడిందని అలాంటి పార్టీకి మళ్లీ ఎందుకు మద్దతిస్తామన్న లాజిక్‌ను సదరు ఎంపీ  పీకే ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే పీకే వ్యూహాత్మకంగా వైసీపీ పుట్టుపూర్వోత్తరాల జోలికి వెళ్లకుండా భవిష్యత్ రాజకీయాన్ని వారికళ్లకు కట్టినట్లుగా చెప్పారంటున్నారు. రెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించినట్లుగా చెబుతున్నారు.  


కేసుల్లో వేగం పెరిగితే  వేధింపులని ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందవచ్చని సలహా...!


అయితే సదరు ఎంపీ చెప్పకపోయినా పీకేకి మాత్రం....  ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరే... బీజేపీకి దూరం అయితే.. కేసులబాధ ఉంటుందని మాత్రం అర్థం చేసుకోగలరు. అందుకే అడగకుండానే పీకే తన సలహాదారు పదవిలోకి మారిపోయి... ఒక్క సారి బీజేపీకి దూరమైన  తర్వాత... కేసులు పడితే వేధింపులకు పాల్పడుతున్నారని ప్రజల్లోకి వెళ్లి మద్దతు పెంచుకోవచ్చని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధినేతతో చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటామని పీకేకు సదరు ఎంపీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీనిపై ఇప్పటికిప్పుడు కాకపోయినా... మరో ఐదు నెలల్లోగా ఖచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


వైసీపీ వెనక్కి తగ్గితే టీడీపీ కోసం పని చేయనున్న పీకే..?


పీకే మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ అంగీకరించకపోతే.. ఆయన టీడీపీ వైపు చూసే అవకాశం ఉంది. టీడీపీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కాస్త దగ్గరగానే ఉంది. అయితే.. ఇప్పుడు  దగ్గరా.. దూరమా అన్నది చెప్పడంలేదు. అలాగని బీజేపీ వ్యతిరేక పక్షాల భేటీకి వెళ్లడం లేదు..  ఇప్పుుడు వైసీపీ తిరస్కరిస్తే  టీడీపీని పీకే ఆహ్వానించవచ్చు.. కానీ ఏపీలో తమ కోసంపని చేస్తేనే... తాము కాంగ్రెస్ కూటమిలోకి వస్తామి టీడీపీ షరతు పెడితే వైసీపీకి ఇబ్బంది ఎదురవుతుంది. పీకే టీడీపీకి పని చేస్తే ..సెంటిమెంట్ దెబ్బతింటుంది. వైసీపీలో ఈ  ఆందోళన కూడా కనిపిస్తోంది.