Kandukur Arrest :   కందుకూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్న ఆయన తన వ్యాపార సంస్థ కార్యాలయంలో ఉండగా కందుకూరు నుంచి రెండు కార్లలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కనీసం నోటీసులు కూడా జారీ చేయకపోవడంతో ఆయన అరెస్ట్ గురించి ఎవరికీ తెలియలేదు. ఆయనను కందుకూరు నుంచి వచ్చిన సివిల్ డ్రెస్ లో ఉన్న  పోలీసులు తీసుకెళ్లినట్లుగా కార్యాలయ సిబ్బంది చెప్పడంతోనే విషయం వెలుగు చూసింది.  ఇటీవల కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అరెస్ట్ వ్యవహారంపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 


కందుకూరు ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఎఫ్ఐఆర్‌లో నిందితులు ఎవరు అన్నది ప్రకటించలేదు. విచారణ తర్వాత నిందితుల్ని చేరుస్తామని చెప్పారు. ఆ తర్వాత నిందితులుగా ఎవరిని చేర్చారన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. టీడీపీ నియోజకర్గ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేయడంతో ఆయనను నిందితుడిగా చేర్చారన్న అభిప్రాయం  వినిపిస్తోంది. 
  
చంద్రబాబు నాయుడు ర్యాలీలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడానికి పరిమితికి మించి జనం తరలి రావడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అనుమతించిన ప్రదేశం కాకుండా వేరే ప్రదేశంలో మీటింగ్‌ పాయింట్ ఏర్పాటు చేయడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  డిఎస్పీ స్థాయి అధికారితో విచారణకు గుంటూరు రేంజి డిఐజి త్రివిక్రమ్ వర్మ ఆదేశించారు.   సిఆర్‌పిసి 174 ప్రకారం కేసు నమోదు చేసినట్లు డిఐజి తెలిపారు. సభకు అనుమతించిన ప్రదేశంలో కాకుండా మరో ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడి వాహనం నిలపడంతో ప్రమాాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు సభ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారని, తాము అనుమతి ఇచ్చిన ప్రాంతం కంటే చంద్రబాబు 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు.  సాయంత్రం 7.30కు సభ జరగాల్సి ఉన్నా, ఆలశ్యం కావడం వల్ల ప్రమాదం జరిగిందని మీడియాకు చెప్పారు.  చంద్రబాబు కాన్వాయ్ వేగంగా ముందుకు వెళ్లడం కూడా ప్రమాదానికి కారణమైందని ఎస్పీ తెలిపారు. 


తాము అనుమతి ఇచ్చిన ప్రాంతంలో తొక్కిసలాటకు అవకాశం ఉండేది కాదని, చంద్రబాబు ఇరుకుగా ఉన్న రోడ్డులోకి వెళ్లడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిందని ఎస్పీ వివరించారు. జనం ఒక్కసారిగా నెట్టుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. చంద్రబాబును చూడ్డానికి, ఫోటోలు తీయడానికి జనం ఎగబడటం, ప్రజలు ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చూపించారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ గురువారం ఉదయం నుంచి అన్ని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ సీనియర్ నేతల ఇళ్ల వద్ద పోలీసుల్ని మోహరించడంతో టీడీపీ నేతలు ఏదో జరగబోతోందని అనుకుంటున్నారు.