నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహా రెడ్డి’ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం 6న ఒంగోలులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగాల్సి ఉంది. కానీ ఈ ఈవెంట్‌కు అక్కడి పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈవెంట్‌ గ్రాండ్‌గా జరపబోతున్నామని భారీ పోస్టర్లు, టీజర్లతో సోషల్‌ మీడియాలో ప్రొమోట్‌ చేసిన తర్వాత పోలీసులు ఇలా పర్మిషన్‌ ఇవ్వకపోవడం రాజకీయం అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటీ?


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో వల్లే మూవీ ఈవెంట్స్‌కు పర్మిషన్లు లభించడం లేదని తెలిసింది. అయితే, అభిమానులు లక్షల సంఖ్యలో వస్తారని, వారిని అదుపు చేయడం కష్టమవుతుందని, పైగా సినిమా టీం ఎంచుకున్న ప్రదేశం వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందన్న కారణంతో అనుమతి ఇవ్వలేకపోతున్నామని పోలీసులు అంటున్నారు. కావాలంటే ఒంగోలు శివారు ప్రాంతాల్లో ఈవెంట్ జరుపుకోవచ్చని పోలీసులు సలహా ఇచ్చారట. ఎప్పటినుంచో అక్కడ ఈవెంట్ జరపాలని అనుకుంటున్నప్పుడు ఎటువంటి అభ్యంతరం తెలపని పోలీసులు.. ఇప్పుడు అన్నీ ఫిక్స్‌ చేక ఇలా అనడం సబబు కాదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీకాకుండా ఇప్పటికప్పుడు మరో ప్రదేశాన్ని వెతుక్కోవడం కుదిరేపని కాదని వాపోతున్నారు. అయితే, ఈవెంట్ జరుగుతుందా? వాయిదా వేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 


ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్‌ నటించింది. గోపీచంద్ మలినేని సినిమాకు దర్శకత్వం వహించారు. థమన్‌ సంగీతం అందించాడు. వరలక్ష్మి శరత్‌ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సినిమా ఉండబోతోంది.


‘వాల్తేరు వీరయ్య’ లైన్ క్లియర్?


మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది. విశాఖపట్నంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలనుకున్నారు. కానీ అక్కడి పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వలేమని, లక్షల సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాల్సి వస్తుందనే కారణంతో పర్మిషన్‌ ఇవ్వనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, జనవరి 8వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు తాజా సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’లోనూ శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించింది. మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. కే.ఎస్‌ రవీంద్ర (బాబి) తెరకెక్కించిన ఈ సినిమా 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 


ఆంధ్రప్రదేశ్‌లో మూవీ ఈవెంట్స్ జరగడమే అరుదు. ఇప్పుడు వస్తున్న ఒకటి రెండు ఈవెంట్స్‌ను కూడా అడ్డుకోడానికి ప్రయత్నిస్తే ఎలా అని అభిమానులు అంటున్నారు. ఒకప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా ఈవెంట్లు జరిగేవని, ఇప్పుడే ఎందుకు అభ్యంతరాలు ఎందుకు చెబుతున్నారంటూ ట్విటర్‌లో ఏపీ ప్రభుత్వం, అక్కడి పోలీసుల తీరుపై అభిమానులు రచ్చచేస్తున్నారు. కావాలనే తమ అభిమాన హీరోల సినిమాలను ఆపాలని చూస్తున్నారని, పైకి మాత్రం ట్రాఫిక్‌ కారణం అని చెబుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. 


టికెట్ ధరల పెంపుకు ఒకే!


‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు సంబంధించిన టికెట్ల ధరలను పెంచుకునే వీలును కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది. టికెట్లు ధర రూ.50 వరకు పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. రూ.25 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల కాబోతుండటంతో బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. మరి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ కింగ్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి.