Kakinada News : కాకినాడ జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ తనను మాయమాటలతో లొంగదీసుకుని తల్లిని చేశారని ఓ మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి నోరు మూయించారని ఆమె ఎస్పీ ఎం.రవీంద్రబాబుకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కిర్లంపూడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 36 ఏళ్ల మహిళ మాజీ ఎమ్మెల్యేపై ఇచ్చిన ఫిర్యాదుతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. తాను 11 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు గాంధీమోహన్ ఇంట్లో పనిమనిషిగా చేరానని, రెండున్నరేళ్ల తరువాత తనను లైంగికంగా వేధింపులకు పాల్పడి మాయమాటలతో లొంగదీసుకున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించినందుకే తనకు మూడుసార్లు అబార్షన్ చేయించినా విషయం బయట పెట్టలేకపోయానని చెబుతోంది. 


పెద్దల పంచాయితీ కూడా 


17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నాలుగోసారి గర్భవతినయ్యానని, అప్పుడు అబార్షన్ చేయిస్తే ప్రాణాపాయం అని డాక్టర్లు చెప్పారని బాధిత మహిళ ఆరోపిస్తుంది. 2003లో తాను మగబడ్డకు జన్మనిచ్చానని చెప్పింది. గాంధీమోహన్ తన పలుకుబడిని ఉపయోగించి తన బిడ్డకు వేరే ఎవరిపేరును తండ్రిగా రికార్డుల్లో రాయించారని, అయితే తమ పోషణ మాత్రం గాంధీమోహన్ చూసేవారని మహిళ పేర్కొంది. ఈ విషయంపై పెద్దల్లో తగువు కూడా జరిగిందని, ఆయన బంధువులు వచ్చి తనను, తన బాబును జీవితాంతం బాగా చూసుకుంటామని, బాబును చదివిస్తానని చెప్పి రెండు లక్షల రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేశారని వెల్లడించింది. 


రాజకీయ కుట్రలో భాగంగా 


గత ఏడాది వరకు తనతో గాంధీమోహన్ సహజీవనం చేశారని ఆరు నెలలుగా తనను, తన బిడ్డను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని మహిళ ఆరోపిస్తుంది. అడిగినా తప్పించుకుని తిరుగుతున్నారని వాపోయింది. అయితే తన వద్దకు వస్తే గాంధీమోహన్, అతని బంధువులు చంపేస్తామని బెదిరిస్తున్నారని, అతని వల్ల తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే మహిళ ఎస్పీకు ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ తనను రాజకీయంగా అణగదొక్కేందుకే కొందరు చేస్తున్న కుట్రలో భాగమని, తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. దీనిపై ఎస్పీ ఎం.రవీంద్రబాబు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయిస్తున్నట్లు వెల్లడించారు.


Also Read : Minister Vidadala Rajini : మృతదేహాల విషయంలో వ్యాపారమా? బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి విడదల రజిని