Acharya: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన సినిమా 'ఆచార్య'. ఏప్రిల్ 29న... అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో పది రోజుల పాటు టికెట్ మీద 50 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ. 50, సింగిల్ స్క్రీన్ లో రూ. 30 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.
టికెట్ రేట్లు పెంచడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది విమర్శిస్తున్నారు. 'చిరంజీవి సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా?' - ఈ రోజు ఏర్పాటు చేసిన ఆచార్య విలేకరుల సమావేశంలో చిరంజీవికి ఎదురైన ప్రశ్న.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ "కరోనాతో అన్ని రంగాలు కుంటు పడ్డాయి. అందుకు సినిమా పరిశ్రమ ఏమీ అతీతం కాదు. ప్రపంచంలో అన్ని రంగాలు నష్టపోయినట్టు... మా సినిమా రంగం కూడా నష్టపోయింది. కరోనా వల్ల బడ్జెట్ పై వడ్డీలకు వడ్డీలు పెరిగాయి. మా సినిమాకు ఎంత వడ్డీ కట్టామో తెలుసా? ఒక మీడియం సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందో అంత వడ్డీ కట్టాం" అని చెప్పారు.
"మా ఆచార్య సినిమాకు సుమారు 50 కోట్లు బడ్జెట్ పెరిగింది. ఈ కరోనా కాలంలో వడ్డీల వల్ల పెరిగిన భారం ఇది. టిక్కెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలు దగ్గర వేడుకుంటే తప్పేముంది? వినోదాన్ని పంచే నటులకు ప్రేక్షకులు ఇంతా అని ఇస్తున్నారు, అందులో తప్పేముంది? ఇది అడుక్కోవడం కాదు. మేం ప్రభుత్వాలను వేడుకున్నాం, వాళ్ళు ప్రజలపై భారం పడకుండా రేట్లు పెంచారు" అని చిరంజీవి స్పందించారు.
Also Read: అక్షయ్ కుమార్‌తో హీరో సూర్య తొలి బాలీవుడ్ చిత్రం
బడ్జెట్లు పెరగడం వల్ల టికెట్ రేట్లు పెంచాల్సి వస్తోందని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఆచార్య సినిమా కోసం చిరంజీవి గారు మూడేళ్లు కష్టపడి పని చేశారని, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ... రామ్ చరణ్ ఈ సినిమా కోసం పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఆఫీసుకు వస్తే... బడ్జెట్ లెక్కలు ఎంత అయ్యిందో చెబుతామని ఆయన తెలిపారు.
Also Read: 'జబర్దస్త్'కు జడ్జ్ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?
చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు.