Acharya: 'ఆచార్య'కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఈ నెల 29న (శుక్రవారం) సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి పది రోజుల పాటు... అంటే మే 8వ తేదీ వరకు సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఏపీలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ వంటి వ్యత్యాసం లేదు..‌‌. అన్ని థియేటర్లలో, అన్ని టికెట్స్ మీద 50 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ లభించింది. దీంతో సెకండ్ వీకెండ్ వరకు ఏపీలో ఆచార్యకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.


తెలంగాణలోనూ 'ఆచార్య' టికెట్ రేట్స్ పెరిగిన సంగతి తెలిసిందే. ఏపీ కంటే ఒకరోజు ముందు... సోమవారం నాడు కెసిఆర్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణలో ఆచార్య టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 30 రూపాయలు పెరిగాయి. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన క్షణాలలోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.


'ఆచార్య' సినిమాలో కొన్ని సన్నివేశాలను చిరంజీవి, రామ్ చరణ్, ఇతర ప్రధాన తారాగణంపై మారేడుమిల్లి అడవులలో షూటింగ్ చేశారు. సినిమా నిర్మాణ వ్యయం, ఏపీలో చిత్రీకరణ చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అక్కడి ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. హై బడ్జెట్ కేటగిరీ ఆచార్య టికెట్ రేట్స్ పెరిగాయని సమాచారం. 


Also Read: 'జబర్దస్త్'కు జ‌డ్జ్‌ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?


చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ఎంపిక చేయగా... ఆమె సన్నివేశాలను డిలీట్ చేసినట్లు కొరటాల శివ తెలిపారు. 


Also Read: తెలంగాణలో ఆచార్య టికెట్ రేట్లు పెంపు - ఎంత పెరిగాయంటే?