Bendapudi Govt School : కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాలను అస్ట్రేలియన్ టీచర్ శుక్రవారం సందర్శించారు. బెండపూడి విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతున్న విధానాన్ని చూసి ఆమె ఫిదా అయ్యారు. యూట్యూబ్ లో బెండపూడి విద్యార్థుల అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడటం చూసిన టీచర్ వీవీఎన్, విద్యార్థులను కలిసేందుకు కుటుంబంతో సహా బెండపూడి హైస్కూల్ కి వచ్చారు. టీచర్ వీవీఎన్ భర్త వినోద్ పిల్లలతో కలిసి విద్యార్థులతో ఇంగ్లీష్ లో మాట్లాడారు. అమెరికన్ స్లాంగ్ ఏ విధంగా నేర్పారో ప్రసాద్ మాస్టర్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిశారు ఆస్ట్రేలియన్ టీచర్. ఇంగ్లీష్ భాషను ప్రోత్సహిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, కలెక్టర్ కృతికా శుక్లాను అభినందించారు.
ఇంగ్లీష్ ట్రైనింగ్ విధానం పరిశీలన
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం బెండపూడి హైస్కూల్ పాఠశాల విద్యార్థుల అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియోలు యూట్యూబ్ లో ఆస్ట్రేలియాలో సిడ్నీ కు చెందిన వినోద్, వీవీఎన్ కుటుంబం చూశారు. ఒకసారి ఆ విద్యార్థులను కలవాలని గురువారం బెండపూడి పాఠశాలను సందర్శించారు. ఇంగ్లీషు టీచర్ ప్రసాద్ విద్యార్థులకు సులభంగా ఆంగ్ల భాషలో మాట్లాడించిన విధానం, అనుసరించిన మెళకువలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు వీవీఎన్. వినోద్, వీవీఎన్ దంపతులు బెండపూడి హైస్కూల్ విద్యార్థుల మాదిరిగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడే విధంగా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా నుంచి కాకినాడ జిల్లాకు వచ్చినందకు వీవీఎన్ కుటుంబానికి కలెక్టర్ కృతికా శుక్లా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన వీవీఎన్‌ను పెళ్లి చేసుకున్నారు.
బెండపూడి విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ ముచ్చట
అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడి అదరగొట్టిన బెండపూడి విద్యార్థులకు ఇటీవల మంచి గౌరవం దక్కింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారిన ఈ బెండ పూడి స్కూల్ విద్యార్థులు అమెరికన్ కాన్సులేట్ జనరల్ మెప్పును కూడా పొందారు. వెల్డన్ బెండపూడి స్టూడెంట్స్ అంటూ అమెరికన్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ వారితో ఆగస్టు నెలలో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అభినందనలు తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్ ఎక్స్ ద్వారా విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ మాట్లాడేందుకు బెండపూడి హైస్కూల్‌లో స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు సుమారు 20 నిమిషాలు పాటు డోనాల్డ్ హెప్లిన్‌తో మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో డోనాల్డ్ ముచ్చటించారు. అయితే డోనాల్డ్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న విద్యార్థులను ప్రశ్నించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి ఉందని అడగ్గా విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా సత్సంబంధాల అభివృద్ధికి ఆంగ్లభాష వారధిగా నిలుస్తుందని హెప్లిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ దేశ యాక్సింట్‌లో అనర్గళంగా మాట్లాడేలా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ప్రసాద్ మాస్టారును డోనాల్డ్ హెప్లిన్ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : YS Sharmila : జగన్‌కు షాకిచ్చిన చెల్లి షర్మిల - "పేరు మార్పు" వివాదంపై తాజాగా చేసిన కామెంట్స్ ఏమిటంటే ?