Viveka Murder Case :  మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరూ తప్పించుకోలేరని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra reddy) అన్నారు. సీబీఐ(CBI) అధికారులు విచారణ వేగవంతం చేసి ముద్దాయిలు ఎంతటివారైనా వదలకుండా అరెస్టులు చేస్తారని అన్నారు. కడప(Kadapa) నగరంలో ఉక్కు దీక్షకు మద్దతు తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులను కాపాడాలన్న ప్రయత్నం లో వివేకా కుమార్తె సునీతా, అల్లుడు రాజశేఖర్ పై హత్యా ఆరోపణలు చేయడం చాలా బాధకరమన్నారు. హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్న వివేకా పి.ఏ కృష్ణా రెడ్డి కూడా హత్యలో ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి తో లాలూచి పడ్డారన్నారు. చాలా పకద్భండిగా సీబీఐ ఉన్నతాధికారులు వివేకా హత్య కేసును విచారిస్తున్నారని త్వరలోనే హత్యతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ  అరెస్టు చేస్తారన్నారు. వివేకా హత్య కు సుపారి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరూ ఇచ్చారన్నా దిశలో సీబీఐ విచారిస్తుందన్నారు. 


ఉక్కు పరిశ్రమపై 


కడప ఉక్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సంస్థలు ముందుకు రావడం లేదని మాజీ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు రిలే దీక్ష కడప ఉక్కు సాధన కమిటీ అధ్వర్యంలో చేపట్టారు. ఈ ఉక్కు దీక్షకు డీఎల్ రవీంద్రారెడ్డి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా పతనం అంచులో ఉందని, రానున్న కాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అది సాధ్యం కాదన్నారు.  


వివేకా హత్య కేసుపై గతంలో డీఎల్ ఏమన్నారంటే?


వివేకా హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందులలో అందరికీ తెలుసు అని తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసులో సంబంధం ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులు తప్పించుకోలేరన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్ రవీంద్రారెడ్డి. డా.సునీత రాజకీయాల్లోకి రారని డీఎల్ అన్నారు. సునీత, ఆమె భర్త తన ఇంటికి వచ్చారని, కరోనా టైంలో ఆక్సిజన్ సిలెండర్లు ఇచ్చేందుకు పులివెందుల వచ్చారన్నారు. అప్పుడు మా ఇంటికి వచ్చారని డీఎల్ తెలిపారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన వైసీపీ నేతల(Ysrcp Leaders) ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని డీఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శించారు. 


"నాకు తెలిసినంత వరకు అవినాష్‍రెడ్డి తప్పించుకోలేడు. నాకు సీబీఐ(CBI) మీద ప్రగాఢ నమ్మకం ఉంది. పాత్రధారులు, సూత్రధారులు జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి హత్య చేశారని తేలితే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎప్పుడూ వివేకా దగ్గర ఉండేవారు. గంగిరెడ్డికి నేను ఫోన్ చేస్తే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి దేవిరెడ్డి శంకర్రెడ్డికి ఎర్ర గంగిరెడ్డి టచ్‍లో ఉన్నాడు. వివేకా పీఏ కృష్ణారెడ్డి సైతం శంకర్ రెడ్డికి టచ్‍లో ఉన్నాడు. ఇది తెలియక కృష్ణారెడ్డితో సునీత కంఫ్లైంట్ ఇప్పించారు. శంకర్ రెడ్డి ఏం చెబితే అది కంప్లైంట్‍లో కృష్ణారెడ్డి రాసిచ్చారు. సునీత, రాజశేఖర్ ను పక్కన పెట్టుకుని చంద్రబాబు హత్య చేయించారని జగన్ ఆరోపించారు." అని డీఎస్ రవీంద్రారెడ్డి అన్నారు.