కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్టకు గండిపడింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. వరదతో గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున వరద నందలూరు, రాజంపేట చుట్టుపక్కల గ్రామాల్లోకి పోటెత్తుతోంది. దీంతో చెయ్యేరు నది పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నందలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వరదలో 30 మంది గల్లంతు
చెయ్యేరు వరద ముంపుతో గ్రామాల్లో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లపైకి ఎక్కారు. 30 మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. భారీగా ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడిందని అధికారులు వివరించారు. రాజంపేట, నందలూరు మధ్య అస్తవరానికి సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మరోవైపు నందలూరు వద్ద మూడు మృతదేహాలను అధికారులు వెలికితీశారు.
రంగంలోని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
వరద ప్రవాహంలో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యల అందించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో జిల్లాకు రెస్క్యూ టీములు చేరుకున్నాయి. జిల్లాలోని రాజంపేట మండలం తొగురుపల్లి, గుండ్లురు, దిగువ మందపల్లి, ఎగువ మందపల్లి, శేషమాంబపురం, నందలూరు మండలం పాటూరులతో చెయ్యేరు నదీపరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: తీరం దాటనున్న వాయుగుండం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక!
వరద ఉద్ధృతిలో చిక్కుక్కున్న మూడు బస్సులు
అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట తెగిపోవడంతో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లూరు చెక్ పోస్టు వద్ద రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ఈ రోడ్డుపై వెళ్తోన్న మూడు ఆర్టీసీ బస్సులు వరద ఉద్ధృతిలో చిక్కుకున్నాయి. ఒక బస్సు బోల్తా పడింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో పోలీసులు, విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజంపేట డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి, మన్నూరు ఎస్.ఐ భక్తవత్సలం, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి రెండు బస్సుల్లోని 30 మందిని రక్షించారు. నీట మునిగిన మరో బస్సులో ఉన్న 5 మందిని కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టారు.
Also Read: రాజంపేట లో నీటిలో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు
వరదలో 30 మంది గల్లంతు చాలా బాధాకరం: పవన్ కల్యాణ్
కడప జిల్లాలో చెయ్యేరు నది వరదలో 30 మంది గల్లంతు అవ్వడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వరదలో కొట్టుకుపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెయ్యేరు లోతట్టు ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొని ఉందన్నారు. శివాలయంలో దీపారాధనకు వెళ్ళిన భక్తులు, పూజారి వరదలో చిక్కుకొని గల్లంతయ్యారన్నారు. వరద ఉద్ధృతిని అన్నమయ్య జలాశయం మట్టికట్ట పరిస్థితిని అధికార యంత్రాంగం ముందుగా అంచనా వేసి, ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదన్నారు. ప్రస్తుతం నెలకొన్న జల విలయంతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ప్రజల జీవనం అస్తవ్యస్థం అయ్యిందన్నారు. రైతాంగానికి కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లిందన్నారు. తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో వరదల మూలంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. నగరంలో పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయని, రహదారులు చెరువుల్లా మారాయన్నారు.
Also Read: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం.. 5లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ప్రజలకు సాయం అందించండి
చిత్తూరు జిల్లాలో వందల గ్రామాలు వరద ముంపులో ఉన్నాయని పవన్ కల్యాణ్ తేలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల జనసేన నాయకుల నుంచి పార్టీ కార్యాలయం సమాచారం తీసుకొంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలను భయాందోళనలు తొలగించేలా ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందించాలని కోరారు. వరదల మూలంగా ఇబ్బందిపడుతున్నవారికి సాయంగా నిలవాలని జనసేన నాయకులు, శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Also Read: తీరం దాటిన వాయుగుండం.. అయినా అప్రమత్తత అవసరం..