Janasena Protest: వాలంటరీ వ్యవస్థపై దుష్ప్రచారం చేశారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను వైసీపీ నాయకులు, వాలంటీర్లు దగ్ధం చేయడంపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈరోజు శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన పార్టీ శ్రేణులు సిద్ధపడగా.. జనసేన నాయకుల నుంచి దిష్టి బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జనసేన నాయకుల మధ్య తీవ్ర ఉద్రికత చోటు చేసుకుంది. ఈక్రమంలోనే జనసేన నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎంతచెప్పిననా వినకపోవడంతో ఆందోళన చేస్తున్న జనసేన నాయకులను పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్
ఈ క్రమంలోనే జనసేన నాయకుడు కొట్టే సాయిపై శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. పోలీసులు జనసేన నాయకుడిపై చేయి చేసుకోవడాన్ని జనసైనికులు ఖండించారు. జనసేన నాయకులతో పాటుగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట వినుతను టూ టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ... తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీలను ఎక్కడ తప్పు పట్టలేదని వాలంటరీ వ్యవస్థ సేకరిస్తున్నటువంటి సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని మాత్రమే అన్నారని చెప్పుకొచ్చారు. దాని వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం, వాలంటరీలను తప్పు పట్టినట్లు వక్రీకరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విద్వేషం పెంచుతున్నారని అన్నారు. వాలంటీర్ల ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనాని దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి లేని ఆంక్షలు.. జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే వస్తాయా అని ప్రశ్నించారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని వివరించారు.
ముక్కా శ్రీనివాస్ ఇంటిపై దాడి
మరోవైపు విశాఖలో జనసేన నేత ముక్కా శ్రీనివాస్ ఇంటి పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ముక్కా శ్రీనివాస్ కారు పూర్తిగా దగ్ధం అయింది. ఇటీవల కాలంలో అనేక న్యూస్ చానల్ లైవ్ డిబేట్స్ లో జనసేన పార్టీ తరుపున ముక్కా శ్రీనివాస్ గట్టిగా తన గళం వినిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా లైవ్ డిబేట్ లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి పై విరుచుకుపడ్డారు. ఈక్రమంలోనే ఆయన ఇంటిపై దాడి జరిగిందని.. ఇది చేసింది వైసీపీ గూండాలే అని ముక్కా శ్రీనివాస్ చెబుతున్నారు. వైజాగ్ గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని.. జనసేన ఎంపీగా పోటీ చేసిన తనకే రక్షణ లేకపోతే సామాన్యులు పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ముక్కాపై దాడి జరగడం ఇది రెండోసారి. దాడి విషయమై ముక్కా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దాడిలో దుండుగులు భారీ బండరాళ్లు వాడినట్లు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఎన్ని దాడులు జరిగినా భయపడేదని లేదని ముక్కా శ్రీనివాస్ వివరిస్తున్నారు.