స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయం. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం సరి కాదు. జైళ్ల శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి.' అని పవన్ అన్నారు.


టవర్ ఏసీ ఏర్పాటు


రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు డీహైడ్రేషన్, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆయన బ్యారక్ లో టవర్ ఏసీని జైలు అధికారులు ఏర్పాటు చేశారు. ఆయనకు ఏసీ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని టీడీపీ శనివారం కోర్టును ఆశ్రయించగా అత్యవసరంగా విచారించిన న్యాయస్థానం జైలు అధికారులకు తగు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటల సమయంలో జైలు లోపలికి టవర్ ఏసీని జైలు లోపలికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


కుటుంబ సభ్యుల ఆందోళన


చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దద్దుర్లతో బాధ పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ మేరకు వైద్యాధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. శనివారం ములాఖత్ అనంతరం లోకేశ్, బ్రాహ్మణి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానం, ఉన్నతాధికారుల దృష్టికి తక్షణమే తీసుకెళ్తామని డీఐజీ రవికిరణ్ తెలిపారు.


'న్యాయానికి సంకెళ్లు' పేరిట నిరసనకు పిలుపు


స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన సీఎం జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15 (ఆదివారం) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బన్ కట్టుకొని నిరసన తెలపాలన్నారు. న్యాయానికి  'ఇంకెన్నాళ్లీ సంకెళ్లు' అని నినదించాలని కోరారు. ఆ వీడియోలు సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివారం 'న్యాయానికి సంకెళ్లు' నిరసనలో పాల్గొన్న అనంతరం నారా లోకేశ్ సాయంత్రం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.