Janasena Counter To Ysrcp : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా ఎన్నికల వ్యూహం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ప్రకటించగానే తాడేపల్లి ప్యాలెస్ లోని ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు హ‌డ‌లిపోతున్నార‌ని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను అంతమొందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ చెప్పగానే వైసీపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుపు కష్టమని డిసైడ్ అయిపోయిన వైసీపీ నేతలు ఇష్టానుసారం అవాకులు చెవాకులు పేలుతున్నారని పోతిన మహేష్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ తప్పదని, సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. జ‌న‌సేన పీఎసీ స‌మావేశంలో ప‌వ‌న్ ప్రసంగం త‌రువాత వైసీపీ నేత‌లు ఎదురు దాడి ప్రారంభించ‌టంతో జ‌న‌సేన కూడా కౌంట‌ర్ వ్యాఖ్యలు చేస్తోంది. జ‌న‌సేన నేత పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లుగా వైసీపీ ఏనాడూ సామాజిక న్యాయం పాటించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు ఇలా ఏ వర్గానికీ సరైన రాజకీయ సాధికారత ఇవ్వలేదు. ప్రెస్ మీట్ పెట్టి  పవన్ కల్యాణ్  ని తిట్టించడానికి మాత్రం జగన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తున్నారు.   


ఆ రెండు కంపెనీల నుంచే ఏడాదికి రూ. 35 వేల కోట్లు  


అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జేపీ వెంచర్స్, జే బ్రాండ్ అనే రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. ఈ రెండు కంపెనీల నుంచి ఏడాదికి రూ. 35 వేల కోట్లు దండుకుంటున్నారన్నారు. ఇసుక తవ్వకాలను జేపీ వెంచర్స్ కు అప్పగించి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి రకరకాల పిచ్చి బ్రాండ్స్ తీసుకొచ్చి మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది మంత్రులు మరింత దారుణంగా తయారయ్యారన్నారు. పార్టీ జెండాలో ఉన్న నీలి రంగును ఆదర్శంగా తీసుకొని నీలి చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని జనసేన అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ పై, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. రోడ్ల దుస్థితి ప్రపంచానికి తెలియాలని డిజిటల్ క్యాంపెయిన్, సామాన్యుడి గళం వినిపించేలా జనవాణి, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడంతో నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు కులాన్ని ఆపాదించి వేరే పార్టీతో లింకు పెడుతున్నారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ ప్రయత్నాన్ని తిప్పికొడతామని పోతిన మహేష్ అన్నారు.  


బకాసురుడి వారసులు 


పవన్ కల్యాణ్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోస్తామని పోతిన మహేష్ తీవ్రంగా స్పందించారు.  ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాల నుంచి లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. బకాసురుడు మాదిరి మంది సొమ్ము తింటున్నారన్నారు. బకాసురుడు వారసులు వైసీపీ నేతలని విమర్శించారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? ఒక్క పెట్టుబడిని తీసుకొచ్చారా? 32 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, కనీసం 32 మందికైనా ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు. అధికారానికి దూరంగా ఉన్న కులాలను కలుపుకొని అధికారంలోకి వస్తామని  పవన్ కల్యాణ్ చెప్పగానే వైసీపీ నేతలకు అంత ఉలికిపాటు ఎందుకని మ‌హేష్ ప్రశ్నించారు.


చెల్లిని తరిమేశారు 


"మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఆశయాలు తప్ప ఆస్తులు లేవు. ఆయనకు జగన్ రెడ్డిలా ఫ్యాక్టరీలు, ప్యాలెస్ లు లేవు. సండూర్ పవర్, భారతీ సిమెంట్, సాక్షి పేపర్, సాక్షి ఛానల్ వంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేవు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన జగన్... అధికారంలోకి వచ్చాక రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సీఎం జగన్ కు ఉన్న డబ్బు పిచ్చి వల్ల నోట్ల కట్టల వాసన చూడనిదే నిద్రపట్టదని చర్చించుకుంటున్నారు. ఆస్తుల మీద మమకారంతో సొంత చెల్లికి ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందోనని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. సొంత చెల్లికి చిల్లిగవ్వ ఇవ్వని ముఖ్యమంత్రికి ఎంత డబ్బు పిచ్చి ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలి."  - పోతిన మహేష్ , జనసేన అధికార ప్రతినిధి 


Also Read : AP Highcourt : అమరావతి తీర్పుపై సుప్రీంకెళ్లబోతున్నాం - హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం !