Janasena Leader Naga Babu Emotional Tweet: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో పదేళ్ల నిరీక్షణకు ఫలించిందంటూ జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జనసేన నేత నాగబాబు (Nagababu).. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భావోద్వేగ ట్వీట్ చేశారు. పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైందంటూ పేర్కొన్నారు. 'డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల.. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషంగా & గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం పవన్ నిలబెట్టుకుంటారు' అంటూ నాగబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
'గేట్ కూడా దాటనివ్వం అన్నారు'
అసెంబ్లీ గ్యాలరీలోకి రాక ముందు కూడా నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ను గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వం అన్నారని గుర్తు చేశారు. దానికి కౌంటర్‌గా సింహం అసెంబ్లీలోకి వస్తుందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాగా, గతంలో పవన్‌పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ.. అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన 21 చోట్ల జనసేన విజయం సాధించి రికార్డు సృష్టించింది. శుక్రవారం తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఫవన్ ఫ్యాన్స్‌తో పాటు జనసైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.