Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ దొరికి కాస్తంత ఊరట వచ్చిన వెంటనే కేజ్రీవాల్‌కి మరో షాక్ తగిలింది. రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌ని వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ని విచారించిన కోర్టు బెయిల్‌పై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌కి రౌజ్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వెంటనే ఈ బెయిల్‌ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టుని ఆశ్రయించింది. జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుడేజాతో కూడిన ధర్మాసనం ఈ స్టే ఇచ్చింది. అయితే..అంతకు ముందు మరో బెంచ్ మాత్రం స్టే విధించాలన్న ఈడీ పిటిషన్‌ని తోసిపుచ్చింది.


ఈడీ తరపున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ బెయిల్‌ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. కేసుని పూర్తిస్థాయిలో విచారించడంలో తమకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, అందుకు అనుకూల వాతావరణం కల్పించడం లేదని అన్నారు. దీనిపై తమ వాదన వినిపించేందుకూ సమయం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. మనీలాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 45ని ప్రస్తావించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ బెయిల్‌పై స్టే విధించాలని కోరారు. దీనిపై ఇంకా విచారణ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.  






తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కావాల్సి ఉన్న హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ పిటిషన్‌పై మరో రెండు మూడు రోజుల పాటు విచారణ జరపాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా జూన్ 25వ తేదీ వరకూ కేజ్రీవాల్ జైల్‌లోనే ఉండనున్నారు. కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏమీ లేవని ట్రయల్ కోర్టు వ్యాఖ్యానించడాన్ని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాల ఆధారంగా ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదని అన్నారు. 






Also Read: J&K Assembly Polls: ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్ముకశ్మీర్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికలు, కసరత్తు మొదలు పెట్టిన ఈసీ