J&K Assembly Elections 2024: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. జమ్ముకశ్మీర్‌తో పాటు హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకూ రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 20 నాటికి ఓటరు జాబితాని విడుదల చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు లేఖలు రాసింది. ఈ మేరకు ఓటరు జాబితాని రివిజన్ చేసుకోవాలని స్పష్టం చేసింది. పోలింగ్ స్టేషన్‌లను గుర్తించడం, వాటిని పోలింగ్‌కి అనుగుణంగా మార్చడం లాంటి ప్రక్రియని జూన్ 25 నుంచి మొదలు పెట్టాలని ఆదేశించింది. హరియాణా, ఝార్ఖండ్‌, జమ్ముకశ్మీర్, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నందున ఓటరు జాబితాని జులై 1వ తేదీలోగా ఫైనల్ చేయాలని స్పష్టం చేసింది. జులై 25న ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ని విడుదల చేయనున్నారు. ఆ తరవాత ఆగస్టు 9వ తేదీ వరకూ అందులో మార్పులు చేర్పులకు అవకాశముంటుంది. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, మరింకే సమస్య తలెత్తినా ఆలోగా పరిష్కరిస్తారు. ఆ తరవాత ఆగస్టు 20వ తేదీన తుది జాబితా అధికారికంగా విడుదల చేస్తారు. చివరిసారి జమ్ముకశ్మీర్‌లో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. తరవాత 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. 


జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రణాళికను ఫైనల్ చేయాలని ఆదేశించింది. ఇక హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీల గడువు నవంబర్‌తో ముగియనుంది. ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు 2025 జనవరితో ముగుస్తుంది. ఈ లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లో ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. 35 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఓటు శాతం నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.