Janasena Nagababu : జనసేన ముఖ్య నేతలు ఎక్కడకు వెళ్లినా వారికి పొత్తుల ప్రశ్నే మొదటగా వస్తుంది. పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన సీనియర్ నేత నాగబాబుకు కూడా అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నాగబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలులో జనసేన నేతలు, కార్యకర్తలతో నాగబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయనకు ఎక్కువ ప్రశ్నలు పొత్తుల గురించే వచ్చాయి. దీంతో పొత్తు ఎవరితో అనేది మా పార్టీ అధ్యక్షుడు అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పొత్తులు కుదిరిన తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని, పొత్తులు కుదరక ముందే పోటీ చేయబోయే స్థానాలపై మాడ్లాడటం అనవసరమని అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం అన్న అలీ వ్యాఖ్యలపై.. నో కామెంట్స్ అన్నారు. వైసీపీ కూడా ఒక పార్టీయేనా అని, దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని విమర్శించారు. జనసైనికులు, వీర మహిళల నుంచి సమస్యలను తెలుసుకోవడానికే తాను కర్నూలుకు వచ్చానని తెలిపారు. కర్నూలులో జనసేన నేతలు, కార్యకర్తలతో నాగబాబు సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం కర్నూలుకు చేరుకున్న నాగబాబుకు జనసేన శ్రేణులు స్వాగతం పలికాయి. సాయంత్రం నాగబాబను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన నాగబాబు.. జనసేన అధికారంలోకి రాగానే పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి కేసుపై దృష్టి పెడతారని తెలిపారు.
పార్టీ బలోపేతంతో పాటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి జిల్లా నేతలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నగరంలో భారీ బైకు ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం కర్నూలు ఐరన్ బ్రిడ్జి, పాతూరు గాంధీ రోడ్డు, చెరువుకట్ట, కలెక్టరేట్ వరకూ గుంతలు పడిన రోడ్లకు మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం.. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తారు. అనంతపురం జిల్లా వీర మహిళలు, జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభల్లో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న నాగబాపు పార్టీ బలోపేతం కూడా ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పవన్ కల్యాణ్ అన్ని జిల్లాలు తిరగలేకపోతున్నారు. పవన్ యాత్ర ప్రారంభం కాక ముందే.. నాగబాబు అన్ని జిల్లాల్లో పర్యటించి.. పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసమే తాను పని చేస్తానని..ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పారు. పవన్ కల్యాణ్ సోదరుడు కావడంతో ఆయనకు ఎక్కడకు వెళ్లినా జనసైనికులు ఘనస్వాగతం పలుకుతున్నారు.