Jahnavi Death: అమెరికా ఈశాన్య విశ్వ విద్యాలయంలోని సీటెల్ క్యాంపస్ నుండి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న జాహ్నవి.. రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఇద్దరు పోలీసులు జోక్ చేసుకోవడం...ఆ వీడియో బయటకు రావడంతో పెను సంచలనంగా మారింది. ఈ ఘటనపై చాలా మందే స్పందిస్తున్నారు. యూఎస్ పోలీసులు మాట్లాడిన తీరుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే కేంద్ర మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. ఏపీకి చెందిన కందుల జాహ్నవి 23వ తేదీన రోడ్డు దాటుతుండగా... వేగంగా వచ్చి పోలీసులు వాహనం ఢీకొట్టి చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏపీ సర్కారు వెంటనే స్పందించిందని.. తెలుగు అసోసియేషన్ ను సంప్రదించి ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కర్నూలు వరకు ప్రత్యేక అంబులెన్సు కూడా కేటాయించినట్లు లేఖలో పేర్కొన్నారు. 






అయితే కందుల జాహ్నవి మృతిపై యూఎస్ పోలీసులు కామెంట్లు చేయడం దారుణం అన్నారు. అమాయక యువతి మరణాన్ని అపహాస్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో ఉండే భారతీయ విద్యార్థుల్లో ధైర్యం కల్పించాలంటే... తప్పు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని కేంద్రమంత్రి జైశంకర్ కు సూచించారు. అలాగే ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయించాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ అభ్యర్థించారు. నిజాలను బయటకు తీసుకొచ్చి జాహ్నవిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ముఖ్యమంగా ఈ సమస్యను యూఎస్ ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో తక్షణమే చేపట్టడానికి, భారత దేశంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాయబారితో సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచించాలని కోరుతూ.. అభ్యర్థిస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.