ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించగానే, వైఎస్ఆర్ సీపీ కౌంటర్లు మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్ చంద్రబాబును పలకరించడానికి రాజమండ్రి జైలుకు వెళ్లగానే ఇద్దరి మధ్య ప్యాకేజ్ బంధం బయటపడిందని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. ‘‘నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది పవన్ కల్యాణ్. ఇన్నాళ్ళూ నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం’’ అని వైఎస్ఆర్ సీపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఆ వెంటనే వరుసగా వైఎస్ఆర్ సీపీ నేతలు పవన్ కల్యాణ్ పై తమ కౌంటర్లు మొదలుపెట్టారు. ‘‘స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. కోట్లాది రూపాయల ప్రజాధనం తన సొంత కంపెనీల్లోకి జమ చేసుకున్నారని విచారణలో సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు హయాంలో వంగవీటి రంగాని నడిరోడ్డుపై చంపినప్పుడు, ముద్రగడ పద్మనాభంని అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే చంద్రబాబుకి ఇప్పుడు మద్దతిస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరీ పొగుడుతుంటే మాకు సిగ్గుగా ఉంది’’ అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు.
‘‘పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిందే చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడానికి అని ఓపెన్‌గా చెప్పేశాడు. తన జీవితాంతం చంద్రబాబుకి ఊడిగం చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు జన సైనికులు, వీర మహిళలు కూడా పవన్ కల్యాణ్ తరహాలోనే చంద్రబాబుకి ఊడిగం చేయాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి’’ అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్లి పరామర్శించడం, ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదు? అని అన్నారు. పొత్తులపై నిర్ణయం తీసుకున్నాను అంటే.. నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో ఎప్పుడో ములాఖత్ అయ్యారు, ఇప్పుడు కొత్తగా జరిగేది ఏముందని అన్నారు.