PM Modi Attack Alliance:
మధ్యప్రదేశ్‌లో పర్యటన..
మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తరవాత భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ కూటమికి లీడర్ లేడని సెటైర్లు వేశారు. ఓ వైపు భారత దేశం ప్రపంచ దేశాలను ఏకంచేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంటోందని, మరో వైపు మాత్రం ఓ దళం దేశాన్ని విడగొట్టాలని చూస్తోందని మండి పడ్డారు. ఇలాంటి వాళ్లంతా కలిసి ఓ కూటమి పెట్టుకున్నారని, భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వీళ్ల అజెండా అని తేల్చి చెప్పారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలన్నదే వాళ్ల కుట్ర అని మండి పడ్డారు.
"ఓవైపు భారత్ ప్రపంచ దేశాలను ఏకం చేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. విశ్వమిత్ర అనే పేరు సాధించుకుంది. కానీ ఇదే దేశంలో ఓ కూటమి మాత్రం దేశ ప్రజల్ని విడగొట్టే రాజకీయాలకు పాల్పడుతోంది. అందుకే ఈ I.N.D.I.A కూటమిని కొందరు ఘమండియా కూటమి అని కూడా పిలుస్తున్నారు. అసలు ఈ కూటమిని లీడర్ ఎవరో తెలియదు. ముంబయిలో ఈ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ ఘమండియా కూటమి ఎలా పని చేయాలన్నది ఆ భేటీలో నిర్ణయించుకున్నారు. ఓ రహస్య అజెండాని కూడా తయారు చేసుకున్నారు. భారత దేశ సంస్కృతిపై దాడి చేయడమే వీళ్ల అజెండా. సనాతన ధర్మాన్ని ముక్కలు చేయడమే వీళ్ల లక్ష్యం.ఇవాళ బహిరంగంగానే కొందరు సనాతన ధర్మంపై మాటల దాడి చేస్తున్నారు. రేపు మనపైనా దాడులు చేస్తుండొచ్చు. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని మనం కచ్చితంగా కట్టడి చేయాలి" "
- ప్రధాని నరేంద్ర మోదీ