Jahnavi Death Case:


జాహ్నవి మృతి..


అమెరికాలోని సియాటెల్‌లో భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి (Kandula Jahnavi Death) మృతి సంచలనం సృష్టించింది. రోడ్డు దాటుతుండగా పోలీస్ ప్యాట్రోల్ వెహికిల్ ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఇద్దరు పోలీసులు జోక్ చేసుకోవడం...ఆ వీడియో బయటకు రావడం మరింత అలజడి రేపింది. ఈ ఘటనపై భారత్‌ సీరియస్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని Consulate General of India తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దారుణం అంటూ మండి పడింది. సియాటెల్‌లోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్విటర్ అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. 


"ఈ ఘటన చాలా దారుణం. సియాటెల్‌తో పాటు వాషింగ్టన్ స్టేట్‌లోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశాం. జాహ్నవి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పాం. కాన్సులేట్, ఎంబసీ అధికారులతో విచారణపై ఆరా తీస్తున్నాం"


- కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్‌ ఫ్రాన్సిస్కో