Jagananna AmmaVodi 2023: వరుసగా నాలుగో ఏడాది అమ్మ ఒడి నిధులను జమ చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది.  2022-23 విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి.... బతుకులు మార్చే గుడి గా సర్కార్ చెబుతోంది.


అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్న జగన్... 
వరుసగా పది రోజులు పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నారు. బుధవారం (28.06.2023) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో బటన్ నొక్కి సీఎం జగన్ నిదులు  జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.


పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిచింది. తాజాగా అందిస్తున్న రూ.6,392.94 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం "జగనన్న అమ్మఒడి" అనే ఈ పథకం క్రింద మాత్రమే జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి  రూ. 26,067.28 కోట్లు కావటం విశేషం. పేదరికమే అర్హతగా కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పారదర్శకంగా, లంచాలకు వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం పని చేస్తోంది.
 
పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ నివారణకు ...
చదువుకునే విద్యార్దులు పనులకు వెళ్ళకుండా, తల్లిదండ్రులు సైతం పేదరికం ద్వార తమ పిల్లలను పనులకు పంపకుండా ఉండేందుకు డ్రాప్ అవుట్స్ ను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకానికి కనీసం అటెండెన్స్ ఉండేలా నిబంధన అమలు చేస్తున్నారు.  పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75% హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. 2018లో ప్రాథమిక విద్యా స్థాయిలో జీఈఆర్ జాతీయ సగటు 99.21 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇది 84.48 శాతానికి పరిమితమైన పరిస్థితి ఉండేదని, అప్పుడు దేశంలోని 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానంలో ఏపీ ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో జగనన్న ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణ వల్ల 84.48 శాతంగా ఉన్న జీఈఆర్ 100.8 శాతానికి చేరిందని అంటున్నారు.  జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10-12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి క్లాసులకు అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తూ వారికి  కూడ అమ్మఒడి అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.


టాయిలెట్స్ లేక ఆడపిల్లల దుస్థితిని చూసి... 
పాఠశాలల్లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు బడులు మానేసే దుస్థితిని కట్టడి చేసేందుకు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ "నాడు - నేడు" ద్వారా నిర్మించిన బాలికల ప్రత్యేక టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం ,  డ్రాపౌట్సును తగ్గించడంతో పాటు విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మ గౌరవం నిలబెట్టాలనే మంచి ఉద్దేశ్యంతో అమ్మఒడి పథకం నిధుల నుండి పిల్లలు చదివే  బడుల  టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్" (TMF) కు రూ. 1,000 లు జమ చేస్తున్నట్లు సర్కార్ చెబుతోంది.


ఇవిగో లెక్కలు...
 విద్యా రంగంలో సంస్కరణల పై  జగనన్న ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో చేసిన వ్యయం లెక్కల వివరాలను కూడ ప్రభుత్వం వెల్లడించింది.
 జగనన్న అమ్మ ఒడి – లబ్ధిదారుల సంఖ్య – 44,48,865, అందించిన మొత్తం రూ. కోట్లలో 26,067.28


జగనన్న విద్యా కానుక – లబ్ధిదారుల సంఖ్య – 43,10,165 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,366.53


జగనన్న గోరుముద్ద – లబ్ధిదారుల సంఖ్య – 43,26,782 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,590.00


పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ – స్కూల్స్ సంఖ్య – 15,715 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,669.00


పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ – స్కూల్స్ సంఖ్య – 22,344 అందించిన మొత్తం రూ. కోట్లలో 8,000.00


వైఎస్సార్ సంపూర్ణ పోషణ – లబ్ధిదారుల సంఖ్య – 35,70,675 అందించిన మొత్తం రూ. కోట్లలో 6,141.34..


స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ – లబ్ధిదారుల సంఖ్య – 10,01,860 అందించిన మొత్తం రూ. కోట్లలో 32.00


డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ట్యాబ్లు  – లబ్ధిదారుల సంఖ్య – 5,18,740 అందించిన మొత్తం రూ. కోట్లలో 685.87


జగనన్న విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 26,98,728 అందించిన మొత్తం రూ. కోట్లలో 10,636.67


జగనన్న వసతి దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 25,17,245 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,275.76


జగనన్న విదేశీ విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 1,858 అందించిన మొత్తం రూ. కోట్లలో 132.41


వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా – లబ్ధిదారుల సంఖ్య – 16,668 అందించిన  మొత్తం రూ. 66,722.36 కోట్లు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial