Jagan issued warnings to the police officers: వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేయకుండా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరు చెప్పి మరీ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఎండీ, చైర్మన్ గా మంచి పదవి ఇచ్చామన్నారు. అయినా ఇప్పుడు డీజీపీ పదవి కోసం దిగజారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రిటైరైపోతారని అనుకుంటున్నారేమో కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకు వచ్చి శిక్షిస్తామన్నారు.
తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును ప్రస్తావించి జగన్ వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ నుంచి వచ్చారని .. డిప్యూటేషన్ అయిపోయాక తెలంగాణకు వెళ్లిపోయినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని జగన్ పోలీసులకు గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని తర్వాత తామే వస్తామని హెచ్చరించారు. చట్టం మీరి ప్రవర్తించిన ప్రతి పోలీసు అధికారులను తీసుకు వచ్చి చట్టం కింద నిలబడతామన్నారు. అలాగే ఇప్పుడు ప్రైవేటు కేసులు కూడా దాఖలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన సోషల్ మీడియా కార్యకర్తల పేర్లను కొన్నింటిని జగన్ చదివారు. హైదరాబాద్ .. నల్లగొండ నుంచి కూడా కొంత మందిని అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.
ఏడేళ్లలోపు కేసుల్లో ప్రొసీజర్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే.. వారెంట్ ఇవ్వాలి. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అరెస్టు చేస్తున్న వారందరూ యంగ్ స్టర్స్ అని జగన్ అన్నారు.
సరస్వతి పవర్ భూముల విషయంపైనా జగన్ స్పందించారు. ఆ భూములను రైతులకు రెట్టింపు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానన్నారు. కొనుగోలు చేసినప్పుడు గ్రామసభలు పెడితే రైతులు ఎకరానికి లక్షా 70వేల రూపాయలు అడిగారని .. తాను మూడు లక్షలు ఇచ్చానని.. అదీ జగన్ అంటే అని ఆయన చెప్పుకు వచ్చారు. సిమెంట్ పరిశ్రమకు నీరు, గనులు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. పరిశ్రమలు రాకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ అనే వ్యక్తి చాలా మంచి వాడని రైతుల్ని సంంతోషంగా ఉంచేందుకు అడిగిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చామన్నారు. అక్కడ సర్వే చేసిన అధికారులు కూడా ఎలాంటి ఉల్లంఘనలులేవని సర్టిఫికెట్ ఇచ్చారని ఎమ్మార్వో బైట్ ను జగన్ మీడియాకు ప్రదర్శించారు.