Andhra Social Media Cases:  సోషల్ మీడియాలో కొంత మంది అంబోతుల్లా తయారయి కుటుంబంలో మహిళలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మదం ఎక్కి, సోషల్ మీడియాలో ఆడ బిడ్డలపై ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెడుతున్నారని మండిపడ్డారు.  ఇంట్లో పిల్లల గురించి కూడా నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మదం ఎక్కువై, కొవ్వు ఎక్కువై, నేరస్తులుగా తయారయ్యి, రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని వదిలేయాలా అని అడుగుతున్నానని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశ్నించారు.   



మదం ఎక్కువైపోయి.. కొవ్వెక్కిపోయి నేరస్తులుగా మారుతున్నారు. మనుషులని మర్చిపోయి పిల్లలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వదిలి పెట్టాలా వీళ్లని అని ప్రశ్నించారు. తన కుటుబంంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలపైనా జుగుప్సాకరమైన పోస్టింగులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు చూసి ఆయన ఇంట్లో చిన్న పిల్లలు కన్నీరు పెట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. 


వైసీపీ వాళ్ల సొంత పత్రిక పెట్టి  ప్రతి రోజు  ఫేక్ కథనాలు రాస్తున్నారని విమర్శించారు.  వైఎస్ వివేక హత్య జరిగిన రోజు.. సాక్షి పత్రికలో ఏ కథనం  వచ్చిందో  అందరికీ తెలుసునన్నారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసి.. తనపై వాళ్ల పత్రికలో నారా సుర రక్త చరిత్ర అంటూ రాశారని  మమ్మల్ని మానసికంగా దెబ్బ తీసేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు.  ఇలాంటి  వారినెవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనతో ఆడుకోవాలని చూస్తే ఎవరిని వదిలి పెట్టనని కొవ్వు ఎక్కిన వారి కొవ్వు తగ్గిస్తానని హెచ్చరించారు. 



పోలీస్ వ్యవస్థ సైతం ఆలోచించుకోవాలన్నారు. నేరస్తుల కంటే మీరు అప్పర్ హ్యాండ్‌లో ఉండాలని  పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలని తాను మరోసారి చెబుతున్నానని పోలీసులకు స్పష్టం చేశారు. భావ వ్యక్తీకరణ పేరుతో ఎవరి పైనైనా పోస్టులు పెడతరా అని చంద్రబాబు ప్రశ్నించారు.  


అమరావతిలో కార్యక్రమాల తర్వాత చంద్రబాబు సచివాలయంలో  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితతో సమావేశం అయ్యారు.  ఢిల్లీ పర్యటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సోషల్ మీడియాపై తీసుకునే చర్యలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.