Kadapa MLA Madhavi Reddy Fires On Mayor: కడప నగరపాలక సంస్థ (Kadapa Muncipal Corporation) సర్వసభ్య సమావేశం గురువారం రసాభాసగా మారింది. ఛాంబర్‌లో వైసీపీ మేయర్ సురేష్ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు చైర్ తీసేయగా.. టీడీపీ మహిళా ఎమ్మెల్యే మాధవీరెడ్డి (MLA Madhavi Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నిలబడి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్, కార్పొరేటర్ల తీరుపై విమర్శలు చేస్తూ వివిధ అంశాలపై మాట్లాడుతుండగా వారు అడ్డుకున్నారు. అయితే, ఎక్స్అఫీషియో మెంబర్‌గా తనకు మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాలకవర్గం తీరును మాధవీరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 'ఓ మహిళను అవమానిస్తారా.? మీరు కుర్చీ లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. ఈ సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా.. పోలీసులు భారీగా మోహరించారు.










డీఆర్సీ సమావేశంలోనూ..


అటు, బుధవారం నిర్వహించిన కడప డీఆర్సీ సమావేశం సైతం గందరగోళం నెలకొంది. ఈ సమావేశంలో స్థానిక నేతలు సహా ఇతర అధికారులు హాజరయ్యారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది. అయితే, సమావేశం ముగుసిందనుకుంటున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. వాటికి సమాధానం ఇచ్చిన అనంతరం ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'డీఆర్సీ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రాలేదు.?. ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి రారు. జిల్లా అభివృద్ధి సమావేశానికి రారు. ఇంకెందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది. అసలు బాధ్యత ఉందా.?. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతుంటే.. ఇవి కూడా పట్టవా.?. ఏం అనుకుంటున్నావు. దమ్ముంటే మీ నేత జగన్ సమావేశానికి రాలేదు. ఎందుకో ప్రశ్నించు. అలాగే మీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రాలేదు. అది అడుగు అంతే కానీ మీ ఇష్టం వచ్చినట్లు ప్రశ్నిస్తానంటే కుదరదు.' అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఈ వీడియో టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 'తల తిక్క ప్రశ్నలు అడుగుతున్న "దొంగ సాక్షి" విలేకరిని ప్రశ్నించిన కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి గారు' అంటూ ట్వీట్ చేసింది.






Also Read: Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు