రాష్ట్రంలోని సామాజిక అడవులను పునరుద్ధరించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ)తో ఒప్పందం చేసుకుంది.  దీని ద్వారా ఐదు జిల్లాల్లో రిజర్వ్ ఫారెస్టులకు ఆనుకుని ఉన్న సామాజిక అడవులను పునరుద్ధరించనుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో వన సంరక్షణ సమితిలకు 50 శాతం అందించనుంది. 


సుమారు 1,443 వన సంరక్షణ సమితిలకు (VSS) అండగా నిలుస్తూ ఐటీసీ  రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 9 కోట్ల పెట్టుబడి పెట్టేలా ITCతో ప్రభుత్వం మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MOU) చేసుకుంది. ఇందులో భాగంగా ఏలూరు, అనకాపల్లి, తిరుపతి, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో యూకలిప్టస్ తోటల సంరక్షణను ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) వై మధుసూదన్ రెడ్డి ప్రకటించారు. 2002లో అటవీ విస్తీర్ణాన్ని కాపాడేందుకు ఈ VSS బృందాలు ఏర్పాటయ్యాయి.


సామాజిక అడవుల పరిరక్షణ చర్యల్లో వన సంరక్షణ సమితులు (VSS) చురుగ్గా పాల్గొంటాయి. అందులోని సభ్యులకు ఏడాది అంతా ఉపాధి అవకాశాలు, వేతనాలను అందిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ వన సంరక్షణ సమితులు ఐదు జిల్లాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో కృషి చేశాయి. సుమారు 30,000 ఎకరాలలకు పైగా సామాజిక అడవులను అభివృద్ధి చేశారు. వీరి కష్టానికి ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. రిజర్వ్ ఫారెస్ట్‌లకు ఆనుకుని ఉన్న సామాజిక అటవీ ప్రాంతాల ద్వారా వచ్చే ఆదాయాల నుంచి వచ్చే లాభాల్లో సమితి సభ్యులు వాటా ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. 


ప్రస్తుతం చాలా చోట్ల వన సంరక్షణ సమితుల ద్వారా యాకలిప్టస్ చెట్లు పెంచుతున్నారు. త్వరలో వాటిని నరికి విక్రయించనున్నారు. వాటి స్థానంలో కొత్త యాకలిప్టస్ మొక్కలు నాటాల్సి ఉంది.  ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన సహకారాన్ని ITC అందిస్తుంది. నరికిన యాకలిప్టస్ చెట్ల స్థానంలో కొత్త మొక్కల పెంపకానికి అవసరమైన వస్తువులు, మొక్కలు, సాంకేతిక సహాయాన్ని అందించనుంది. VSSల ద్వారా అడవుల పెంపకానికి దోహదం చేస్తోంది. 


సామాజిక అటవీ ప్రాంతాల నుంచి వచ్చే దిగుబడి ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం వన సంరక్షణ సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ఇది స్థానిక గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పరిరక్షణ ప్రయత్నం పచ్చదనం పెంపునకు, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, పరిశ్రమలను ఆకర్షించి అభివృద్ధికి దోహదపడేలా సహకారం అందించనుంది. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్స్ అండ్ రా మెటీరియల్స్ డివిజనల్ హెడ్ సునీల్ పాండేతో పాటు పీసీసీఎఫ్ బీకే సింగ్, ఆర్‌కే ఖజురియాతో సహా ఐటీసీ అధికారులు పాల్గొన్నారు.


అసలు వన సంరక్షణ సమితులు ఏంటి?
తరిగిపోతున్న అడవులను రక్షించడానికి, అలాగే క్షీణస్తున్న అడవులను అభివృద్ధి చేయడానికి 1980వ  దశకంలో ప్రజల భాగస్వామ్యంతో అడవులు అభివృద్ధి చేయాలని ఉమ్మడి అటవీ యాజమాన్యం అనే పథకం అమలులోకి వచ్చింది.  దీనిలో భాగంగా అడవుల అంచున ఉన్న గ్రామాలలో వన సంరక్షణ సమితుల ఏర్పాటు జరిగింది. ఈ సమితులు అడవులను కాపాడటమేకాక అడవులలో మొక్కల పెంపకం కూడా చేపట్టాయి.