YSRCP Leader: రాష్ట్రంలో మద్యాన్ని రూపుమాపుతానని ప్రతిపక్ష నేతగా ప్రతిజ్ఞ చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకొన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు సైతం మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తే దాడులను దిగడం, మానసికంగా హింసించడం అనంతపురం జిల్లాలో చూశాం. ఈ ఘటన మరవక ముందే.. తాజాగా ప్రకాశం జిల్లాలో హోటళ్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆ నాయకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.


ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారం చర్చనీయాంశమైంది. వైసీపీ చెందిన నారు అశోక్ రెడ్డి హోటల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. రైడ్స్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను వైసీపీకి చెందిన నాయకుడినని చెప్పుకొన్న ఆయన.. తనలాగే చాలా మంది వైసీపీ నేతలు మద్యం అమ్ముతున్నా వాళ్లను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ఆగ్రహంతో ఊగిపోయారు.


తనపై కుట్రలతోనే ఇబ్బంది పెడుతున్నారని అశోక్ రెడ్డి ఆరోపించారు. "నేను వైఎస్సార్ పార్టీ.. జెండాలు కట్టి.. రంగులు పూసిన.. అధికార పార్టీలో ఉన్న వారిని అరెస్టు చేపిస్తారా మీరు.. నియోజక వర్గంలో వ్యాపారాలు చాలా మంది చేస్తున్నారు. మొత్తం ఆపండి. కాకా హోటల్ వాళ్లు కూడా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మందే అమ్ముతున్నాను. అక్రమ మందు తెస్తున్నానేమో చూడండి. నేను ఒక్కన్నే అమ్ముతున్నానా?" నారు అశోక్ రెడ్డి, వైసీపీ నేత   


దీంతో గిద్దలూరు నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతనే తన హోటల్లో మద్యం అమ్మకానికి కొనుక్కోవడంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఇది హార్ట్ టాపిక్ గా మారింది. అధికార పక్షం నాయకుల ఇలా చేస్తే మిగతా సామాన్యుల పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం అధికార పార్టీ నాయకుడి పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఇప్పుడు గిద్దలూరులో చర్చ జరుగుతోంది. 


ఇటు ప్రతిపక్షాల సైతం అధికార పార్టీ నాయకులు చేసిన చర్య పై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వమే వెనకుండి ఈ దంద కొనసాగిస్తుందని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలను నిషేధిస్తామని చెప్పిన జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాడని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.  


ఎన్నాళ్ళ నుంచి ఈ అక్రమ మద్యం అమ్ముతున్నారని పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇతర దేశాల నుంచి గాని, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి అమ్ముతున్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. కానీ తాను రాష్ట్రంలో దొరికే మందునే విక్రయిస్తున్నానని, తనలాగే మరికొందరు వైసిపి నేతలు అక్రమ మద్యం అమ్ముతున్నారని అధికార పార్టీ నేత అశోక్ రెడ్డి చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 


దీంతో అశోక్ రెడ్డి వద్ద దొరికిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడి నేత చెప్పిన వివరాల ఆధారంగా మిగతా చోట్ల దాడులు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.