Etala Counter : బోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలని బీజేపీ నేత ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈటల ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సినిమా అయినా, ట్రయల్ అయినా అది ప్రజలే చూపిస్తారని, నాయకులు కాదని అన్నారు. సినిమా చూపించేది ప్రజలైతే, చూడాల్సింది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు సినిమా చూపించబోతున్నారన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గారి ఏలుబడిలో గిరిజన, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది... అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్ వన్ అని బుకాయుస్తున్నారు ఈటల విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు భయపెట్టిస్తున్నాయని.. గిరిజన మహిళపై జరిగిన దాడి చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుందని ఆరోపించారు. షీ టీమ్ పెట్టినం అని చెప్తున్నారు. అర్ధరాత్రి కూడా స్వేచ్చగా తిరగవచ్చు అని చెప్పారు. కానీ ఎల్ బి నగర్ లో కూతురు పెళ్లి కోసం వెళ్ళి వస్తున్న మహిళను పోలీసులే తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారన్నారు. క్యారెక్టర్ లేని మహిళగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆమెను కొట్టిన తీరును తీవ్రంగా ఖండించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మహిళ మీద జరిగిన దౌర్జన్యం మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వత్ తెలంగాణ గమనిస్తోందని చెప్పరానిచోట్ల కొట్టిన తీరుపై స్పందించాలన్నారు. చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి భుమనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారని గుర్తు చేశారు. దళిత, గిరిజన మహిళలపై జరుగుతున్న సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బేషరుతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కెసిఆర్ చేస్తున్న పనులని ప్రజలు మర్చిపోరు.. మర్లపడతారని హెచ్చరించారు.
సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో దళితబంధు, డబుల్ బెడ్ రూం కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులను పెట్టీ అరెస్ట్ చేయించారు. పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడిపిస్తారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.