CBI Notices To Avinash Reddy : వివేకా హత్య కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 17న హైదరాబాద్ సీబీఐ ఆఫీస్ కు రావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ తరుణంలో ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. విచారణకు హాజరయ్యేందుకు వస్తానని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది.  


సీబీఐ విచారణపై అవినాష్ రెడ్డి ఆరోపణలు 


వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అధికారులు ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వివేకా అల్లుడిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారుల విచారణ తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూస్తూ.. ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు.  అధికారుల తీరు గురించి సీబీఐ పెద్దలకు కూడా తెలియజేశామన్నారు. పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అన్నారు. తాము లేవనెత్తిన కీలక అంశాలపై వారు స్పందించడం లేదని.. వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా పట్టించుకోవడం లేదని వివరించారు. ఆయన చనిపోయినప్పుడు తానే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చానని.. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంటే గంట ముందుగానే విషయం తెలిసినా ఆయన అల్లుడు పోలీసులకు ఈ విషయం చెప్పలేదని అన్నారు.  


అవినాష్ రెడ్డి అనుచరుడి అరెస్ట్ 


 వివేక హత్య కేసు విచారణలో సీబీఐ శుక్రవారం అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ ను అరెస్టు చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలు వెల్లడించింది. మరోసారి అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించింది కేంద్రదర్యాప్తు సంస్థ. ముగ్గురు కలిసి సాక్ష్యాలు ధ్వంసం చేశారని తెలిపింది.  హత్య జరిగిన రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్ కుమార్ ఉన్నాడని వెల్లడించింది. గూగుల్‌ టేక్‌ అవుట్‌లో లొకేషన్‌కి సంబంధించిన ఆధారాలు లభించినట్టు పేర్కొంది. వివేక చనిపోయారని మూడో వ్యక్తి ద్వారా తెలిసిన తర్వాతే బయటకు వచ్చారని వివరించింది. విషయం తెలుసుకున్న రెండు నిమిషాలకే వివేక ఇంటికి అవినాష్, ఉదయ్, శివశంకర్ రెడ్డి చేరుకున్నారని వెల్లడించింది. ఆయనకు అన్నీ తెలిసని అనుమానం వ్యక్తం చేసింది. సాక్ష్యాల తారుమారులో ఈ ముగ్గురి హస్తం ఉందని కూడా తెలిపింది.