Ex Mla Neeraja reddy : కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత  పాటిల్‌ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా బీచుపల్లి వద్ద టైర్‌ పేలి ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే కర్నూలు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. పాటిల్ నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఫ్యాక్షన్‌ గొడవల కారణంగా హత్యకు గురయ్యారు.  నీరజారెడ్డి కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 2009 నుంచి 2014 వరకు ఆలూరు నియోజకవర్గం నుంచి నీరజారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకు ముందు పత్తికొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై 5వేల ఓట్ల మెజార్టీతో నీరజారెడ్డి గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 






అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం 


 అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై నల్లగుట్టపల్లి పంచాయతీ కొత్తపల్లి క్రాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మమ్మ(65) పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి బంధువులు కారులో తీసుకెళ్తున్నారు. కొత్తపల్లి క్రాస్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో కారును వీరి కారును ఢీకొట్టింది.  ఈ ఘటనలో లక్ష్మమ్మతో పాటు వారి కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) ఘటనాస్థలిలోనే చనిపోయారు. కారులో ఉన్న బంధువులు చిన్నక్క(60), మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప రిమ్స్‌ కు తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నక్క చనిపోయింది. రాయచోటి నుంచి కడప వెళ్తున్న మరో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. 


కడపలో  రోడ్డు ప్రమాదం 


కడప శివారుల్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కర్నూలు జాతీయ రహదారిపై పాలెంపల్లె రాచిన్నాయ పల్లె బైపాస్ రోడ్డులో వేగంగా వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మృతులు చెన్నూరుకు చెందినవారు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన చెన్నూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.