YS Viveka Murder Case: 
విజయవాడ/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గత వారం సీబీఐ కోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. అయితే అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, చంచల్ గూడ జైల్లో భాస్కర్ రెడ్డికి తగిన వైద్య చికిత్స అందిస్తున్నారని సీబీఐ లాయర్ కోర్టును తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. 


వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు శివశంకర్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న A-5 నిందితుడు శివశంకర్‌ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. శివ శంకర్ రెడ్డి పిటిషన్ విచారించిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.