Bandi Sanjay: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలకు కారణమయ్యాయి. పాత అసెంబ్లీ భవనంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  వాజ్‌పేయీ హయాంలో ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందన్నారు. ఈ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, తెలంగాణ, ఏపీ విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రజలు సంతృప్తిపర్చలేకపోయిందని మోదీ అన్నారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేపోయిందని, మరోవైపు ఏపీ ప్రజలుసైతం తీవ్ర ఇబ్బంది పడ్డారని మోదీ అన్నారు. 






దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడడం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్‌ చేశారు. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మీ స్క్రిప్ట్‌ రైటర్‌ను మార్చుకోండి పప్పుజీ అంటూ ఎక్స్‌ వేదికగా సమాధానమిచ్చారు. 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకే ఓటు - రెండు రాష్ట్రాలు అని తొలిసారి పిలుపునిచ్చింది దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయినని అన్నారు. రాహుల్‌ గాంధీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు అందరూ తెలంగాణను మోసం చేశారని ధ్వజమెత్తారు. 






వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు నెహ్రూ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ - జెంటిల్‌మెన్‌ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని బండి సంజయ్‌ అన్నారు. 1969లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వమని తెలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని బండి సంజయ్‌ విమర్శించారు.