New Parliament Builiding: నూతన పార్లమెంటు భవనం నేడు (సెప్టెంబర్ 19న) అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రధాని మోదీ నారీ శక్తి చట్టం అని నామకరణం చేశారు. అదే సమయంలో లోక్ సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. బుధవారం నుంచి దీనిపై చర్చను ప్రారంభించనున్నారు.
సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎంపీలకు అగ్ని పరీక్ష అని పేర్కొన్నట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్ర శాసన సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయినత తర్వాత 2027 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించే భాగ్యం తనకు వచ్చినందుకు దేవుడికి మోదీ కృతజ్ఞత తెలిపారు. "మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది. మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు మన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారని, కానీ దేవుడు నన్ను అనేక పవిత్ర పనులకు ఎంపిక చేశాడు" అని అన్నారు.
అయితే తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని అధికారులు చెప్తున్నారు. ఈ అంశంపై కొత్తగా బిల్లును తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదు. తొలుత 1996లో హెడీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలోనూ ఈ బిల్లను ప్రవేశపెట్టినప్పటికీ ఎప్పుడూ ఆమోదం లభించలేదు. చివరగా 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. అయినప్పటికీ లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది. 2014లో అప్పటి లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు అక్కడే ఆగిపోయింది.
ఈ బిల్లు నేపథ్యంలో లోక్ సభ స్థానాలను 33శాతం పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం లోక్‌సభలో 545 స్థానాలు ఉన్నాయి. వీటిని 33శాతం పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 33శాతం పెంపు అంటే... మరో 180 స్థానాలు పెంచుకోవచ్చు. ఇదే జరిగిన లోక్‌సభలో సీట్ల సంఖ్య... 545 నుంచి 725కు పెరుగుతుంది. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు... లోక్‌సభ స్థానాల పెంపు సాధ్యం కాదు. ఎందుకు అంటే... ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. అంటే 2029 ఎన్నికల నాటికి లోకసభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు.