MLA Anantababu Cace :  ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. దర్యాప్తు అధికారిని మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీసీ ఫుటేజ్ లో ఉన్న వారందరిపై కేసు పెట్టాలని ధర్మాసనం పేర్కొంది.నిందితులు అందరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చాలని తెలిపింది. అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రమణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. 


అనంతబాబు భార్య, మరికొందరి సమక్షంలో ఈ హత్య జరిగిందని పిటిషనర్ల తరఫున జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సీసీటీవీ ఫుటేజ్ లో వారంతా కనిపిస్తున్నారని, అయితే వారిపై కేసు నమోదు చేయకుండా ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక కోసం చూస్తున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేస్తున్నరాని చెప్పారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో దర్యాప్తు సజావుగా సాగడంలేదని, మృతుడి శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయని, దీన్నిబట్టి ఘటనలో అనంతబాబుతోపాటు మరికొందరు పాల్గొన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ కేసును మొదటి అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. బాధితుడి బంధువులు నిరసన చేయడంతో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారు. రిమాండ్ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేయలేదన్నారు.   గడువు దాటిన తర్వాత దాఖలు చేశారు. దీంతో మెజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఎమ్మెల్సీపై రౌడీషీట్ ఉన్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని పటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  


పోస్టుమార్టం ఆధారంగా ఎఫ్ఐఆర్ రీ రిజిస్టర్ చేశారని, దర్యాప్తు నిస్పాక్షికంగా చేస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ను ల్యాబ్ కు పంపించామని, నివేదిక రావాల్సి ఉందని, ఇది సీబీఐకి బదిలీ చేసే కేసు కాదని హోం శాఖ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..కేసును సీబీఐకి ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 


ఇటీవలే ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు సమయానికి చార్జిషీట్ దాఖలు చేయలేదన్న కారణంతో డిఫాల్ట్ బెయిల్ కోసం.. ఆయన సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.   విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ.. సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.  గతంలో అనంతబాబు బెయిల్ పిటిషన్ రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు(AP High Court) కొట్టి వేశాయి. ఈ కారణంగా బెయిల్ కోసం.. అనంతబాబు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. మాజీ డ్రైవర్ హత్యకేసులో అనంతబాబు అరెస్టు అయి.. రాజమండ్రి జైలులో మే 23 నుంచి డిసెంబర్ 13 వరకు జైల్లో ఉన్నారు.  ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. 


కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు-టీడీపీ నేతల మధ్య తోపులాటలు, బారీకేడ్లు ఎత్తిపడేసి మరీ!