Anjali Singh Death Case:


రోజుకో మలుపు..


ఒకే ఒక్క ప్రమాదం. ఎన్నో చిక్కుముడులు. కంజావాలా కేసు రోజుకో తీరుగా మలుపు తిరుగుతోంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని వివరాలు బయటకు వస్తున్నా...అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న స్పష్టత మాత్రం రావడం లేదు. కావాలనే చేశారా..? అనుకో కుండా జరిగిందా అని ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొన సాగిస్తున్నారు పోలీసులు. విచారణ తరవాత పోలీసులు పలు వివరాలు వెల్లడించినా...ఆ తరవాత కూడా క్లారిటీ రాలేదు. మృతురాలు అంజలి సింగ్ స్నేహితురాలు నిధి మీడియా ముందుకొచ్చి మరికొన్ని సంచలన విషయాలు చెప్పింది. కార్‌ కింద చిక్కుకుందని తెలిసినా
కావాలనే ఈ పని చేశారని వెల్లడించింది. అంతే కాదు..బాయ్‌ ఫ్రెండ్‌ తనను విడిచిపెట్టి వెళ్లాడన్న బాధలో అంజలి ఉందని, మద్యం సేవించిందనీ చెప్పింది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే...అంజలి చాలా రోజులుగా తల్లి నుంచి వేరుగా ఉంటోందట. నిధి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన తరవాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. అంజలి బాయ్‌ ఫ్రెండ్ ఎవరు అని ఆరా తీయడం మొదలు పెట్టారు పోలీసులు. అయితే...ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. దాదాపు 12 కిలోమీటర్ల పాటు కార్‌ అంజలిని ఎలా లాక్కెళ్లింది..? వీటితో పాటు మరి కొన్ని ప్రశ్నలకూ తెరపైకి వస్తున్నాయి. 


1. న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పెంచామని పోలీసులు చెప్పారు. మరి 12 కిలోమీటర్ల వరకూ లాక్కెళ్లినా ఎవరూ గమనించలేదా..? 
2. అసలు పోలీసుల కంట పడకుండా ఆ కార్ ఎలా తప్పించుకుంది..? 
౩. సుల్తాన్‌పురి నుంచి కంజావాలాకు వచ్చేంత వరకూ పోలీసులు ఎవరూ లేరా..? యువతి కార్‌కు చిక్కుకున్నట్టు ఎవరూ గుర్తించలేదా..? 
4. ఈ 12 కిలోమీటర్ల మార్గ మధ్యలో ఒక్క పోలీస్‌ కూడా లేడా..? 


సీసీటీవీ ఫుటేజ్..


ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే...నిధి, అంజలి ఇద్దరూ ఒకే స్కూటీపై ప్రయాణించారు. అంతకు ముందు వాళ్లు దేని గురించో గొడవ పడ్డారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఫ్రెండ్‌ని విడిచిపెట్టి నిధి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిధి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చినా...ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 


1. నిధి ఈ యాక్సిడెంట్ గురించి పోలీసులకు ఎందుకు చెప్పలేదు..? 
2. ఈ ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే నిధి గురించి పోలీసులకు తెలిసింది. మరి దీని గురించి మీడియాకు ఎందుకు వెల్లడించలేదు..? 


ఎవరు వాళ్లు..?


ఇక పోలీసులు చెప్పిన మరో విషయం ఏంటంటే...కార్‌లో ఉన్న 5గురితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నామని. కానీ...వారెవరు అన్న వివరాలు వెల్లడించలేదు. వాళ్లెవరు..? ఈ కేసుతో వాళ్లకున్న సంబంధం ఏంటి..? వాళ్లు నిధికి తెలిసిన వాళ్లా..? లేదంటే అంజలికి పరిచయస్థులా..? ఇలా ఎన్నో సందేహాలు కేసుని సంక్లిష్టం చేస్తున్నాయి. 


Also Read: Anjali Accident Case: కార్‌ కింద చిక్కుకుందని వాళ్లకు తెలుసు, నేను ఏమీ చేయలేకపోయాను - మృతురాలి ఫ్రెండ్