YSRCP MLAs Dissatisfaction  :  ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు పాలనా తీరుపైనా.. సొంత పార్టీ నేతల వ్యవహారశైలిపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది పరోక్షంగా కొంత మంది నేరుగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ముందు ముందు జగన్ పాలనకు గళమెత్తుతారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో కానీ.. ఇప్పుడు అయితే పరిస్థితి కట్టు తప్పుతున్నట్లుగానే  కనిపిస్తోంది.


ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి స్వరాలు!


ముందస్తుకెళ్తే ముందే ఇంటికెళ్తామని ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు  ఆగ్రహం తెప్పించింది. అంటే ఆలస్యంగా వెళ్తే ఆలస్యంగా ఇంటికి వెళ్తామని ఆయన చెప్పినట్లే కదా అని అప్పటికప్పుడు ఆయనను తన నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి... నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి సమన్వయకర్త పదవి ఇచ్చారు. అయితే ఆనం మాత్రం తన జోరు తగ్గించలేదు. ఉన్నదే చెప్పానంటున్నారు. ఆనంతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అదే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను జగన్ పిలిపించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చాలా సార్లు నేరుగానే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. వ్యతిరేక కామెంట్లు చేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతూ పెరుగుతోంది. 


ఎన్నికల్లో పోటీ చేయనని జగన్‌కు చెప్పానన్న ధర్మాన - వసంత కృష్ణప్రసాద్ కూడా అంతే !


మరో వైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని జగన్ కు చెప్పానని ... గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో చెప్పుకొచ్చారు. తనకు విశ్రాంతి కావాలన్నారు. అయితే జగన్ ఒప్పుకోలేదని..  ఈ ఒక్క సారి పోటీ చేయమన్నారని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు మాటలు వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపుతున్నాయి. ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఇలా మాట్లాడుతున్నారని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు కానీ.. ఆయన మాట తీరు వల్ల ఆనం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో అలాంటిదే ప్రజల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం కూడా వైసీపీ హైకమాండ్ ను కంగారు పెట్టిస్తోంది. ఆయన తండ్రి ఇటీవల ప్రభుత్వంపై తిరగబడాలని ఓ వర్గానికి  పిలుపునిచ్చారు. తన  తండ్రిని కంట్రోల్ చేయలేనని వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుకు మద్దతుగా నిలిచారు. ఆయనను వేధించడం కరెక్ట్ కాదని తన పార్టీపై నేరుగానే విమర్శలు చేశారు. 


పార్టీలో అంతర్గత విభేదాల వల్లనే ఎమ్మెల్యేలు బయటపడాలని అనుకుంటున్నారా ?


ఎమ్మెల్యేలు ఇలా అదే పనిగా పార్టీ ,  ప్రభుత్వ తీరుపై  ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వైఎస్ఆర్‌సీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరూ జగన్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో లేరని.. కేవలం వారికి వారి నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న రాజకీయ ఆధిపత్య పోరాట పరిస్థితుల కారణంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. కోటంరెడ్డి, ఆనం, వసంత కృష్ణప్రాద్, మద్దిశెట్టి వేణుగోపాల్ ఇలా..  బయట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నవారికీ టిక్కెట్ గ్యారంటీ లేదని అందుకే.. బయటపడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. వారి అసంతృప్తి పూర్తిగా రాజకీయ కారణాలే కానీ.. జగన్ పని తీరు కారణం కాదంటున్నారు. 


భారీ మెజార్టీ రావడమే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారిందా ?


భారీ మెజార్టీ రావడమే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. 175 మంది అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్లే. మరో ఐదుగురు ఇతర పార్టీల నుంచి మద్దతు పలికారు. అయితే ఇప్పుడు  బలమే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మైనస్ గా మారుతోందన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడం.. సంక్షే్మంపై ప్రజల్లో ఆశలు పెరగడం..  అభివృద్ది పనులు జరగకపోవడంతో.. వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.. అన్ని స్థాయిల్లో ఆ పార్టీ నేతలే ఉండటంతో వారి తీరు వల్ల సామాన్య జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది కూడా ... ఎమ్మెల్యేలు  బయటపడుతూండటానికి మరో కారణం అని భావిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తుల్ని వీలైనంత వరకూ తగ్గించకపోతే.. ముందు  ముందు సమస్య అవుతందని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు దిగువశ్రేణి  నేతలు సలహాలిస్తున్నారు.