తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించిన జీవోను సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ  హైకోర్టులో జరిగింది.  భాను ప్రకాష్ పిటిషన్‌పై న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించారని.. ఆయనపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయన్నారు. ధర్మాసనం కూడా కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 


Also Read : దర్శనం టిక్కెట్లు, గదుల బుకింగ్ ఇక ‘జియో’ ద్వారానే.. ఎంవోయూ చేసుకున్న టీటీడీ !


వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేయాలన్న హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేతన్ దేశాయ్ మాజీ భారత వైద్య మండలి అధ్యక్షుడు. 2010లో ఆయన ఎంసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పంజాబ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చేందుకు రూ.2కోట్లు లంచం తీసుకుంటూండగా సీబీఐ అరెస్ట్ చేసింది. కేతన్ దేశాయ్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కాలేజీకి పర్మిషన్లు ఇచ్చారని సీబీఐ గుర్తించింది. నిజానికి  2001లోనే కేతన్ దేశాయ్ ఎంసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. 


Also Read : టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు ! నియామకం చెల్లని హైకోర్టులో పిటిషన్..


అవినీతి విషయంలో ఢిల్లీహైకోర్టు తప్పుపట్టడంతో అప్పట్లో ఒకసారి ఎంసీఐ అధ్యక్షపదవి నుంచి కేతన్‌ తప్పుకున్నారు. తర్వాత మళ్లీ ఆ పదవిని చేజిక్కించుకున్నారు. మళ్లీ అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించారు. అయితే ఎలా వచ్చారో కానీ హఠాత్తుగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చోటు దక్కించుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఎవరు సిఫార్సు చేశారో స్పష్టత లేదు. ప్రభుత్వ పెద్దలకు పరిచయం ఉన్నారో లేక ఇతరత్రా ఎక్కడైనా పరిచయం అయ్యారో కానీ ఎంతో పోటీ ఉన్న టీటీడీ బోర్డులోనే మెంబర్‌గా పదవి దక్కించేసుకున్నారు. 


Also Read : 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు


ఆ పదవి కోసం ఉన్న పోటీ కారణంగా ఏకంగా యాభై గౌరవ మెంబర్స్ ను సృష్టించాల్సి వచ్చింది. అయితే వాటిని కూడా హైకోర్టు పక్కన పెట్టింది. ఇప్పుడు కేతన్ దేశాయ్ లాంటి అవినీతి పరులు బోర్డులో ఉండటంపైనా హైకోర్టు ప్రశ్నించింది.  మూడు వారాల్లో టీటీడీ పూర్తి వివరాలు సమర్పిస్తే ఆ తర్వాత కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 


Also Read : చేతకాకపోతే వైదొలగాలి.. టీటీడీ చైర్మన్, ఈవోలకు ఎంపీ రఘురామ సలహా..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి