Harvest India FCRA : హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ, తన భర్త కత్తెర సురేష్ కుమార్ పై దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. గత మూడు రోజులుగా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. యాభై ఏళ్ల క్రితమే హార్వెస్ట్ ఇండియా సంస్థను స్థాపించారన్నారు. పేదలకు, అస్వస్థతతో ఉన్న వారికి, అనాథ పిల్లలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. పదిహేను అత్యున్నత సేవా అవార్డులు కూడా ఈ సంస్థ అందుకుందని తెలిపారు. మీడియాలో కొంత మంది తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన భర్త కత్తెర సురేష్ కుమార్ అరెస్టు అంటూ వార్తలు రాశారన్నారు.
మూడేళ్ల క్రితమే లైసెన్స్ రద్దు
"నా భర్త విదేశాల్లో ఉన్నారు. కావాలనే కుట్ర చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే FCRA లైసెన్స్ నిలిపి వేసింది. FCRA లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. నిబంధనలకు లోబడి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సీబీఐతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తాం. చట్టాలను, న్యాయ స్థానాలను గౌరవిస్తాం. నలభై యాభై మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిలో నా భర్త పేరు కూడా ఉంది. ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు చిన్న పిల్లల దత్తత చేయడం సాధ్యం కాదు." అని గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా అన్నారు.
అసలేం జరిగింది?
గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర క్రిస్టీనా భర్త కత్తెర సురేష్ పై తీవ్రమైన అభియోగాలతో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి విదేశాల నుంచి అక్రమంగా విరాళాలు తీసుకోవడం కాగా మరొకటి దత్తత పేరుతో మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా వేరే దేశాలకు తరలించారన్నది. కత్తెర సురేష్ హర్వెస్ట్ ఇండియా సొసైటీ పేరుతో మతపరమైన సంస్థను నడుపుతున్నారు. స్వచ్చంద సంస్థగా చెబుతూ విదేశాల నుంచి విరాళాలు తీసుకొచ్చేవారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మతపరమైన సంస్థలు విదేశాల నుంచి విరాళాలు తేవడాన్ని నియంత్రించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని కఠినతరం చేసింది. అయినప్పటికీ ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద ఎత్తున విదేశీ విరాళాలను కత్తెర సురేష్ సేకరించినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల స్వీకరణల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న అనేక మత మార్పిడి సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా 40 చోట్ల సీబీఐ సోదాలు జరిపింది. విదేశీ విరాళాల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్రభుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది. విదేశీ నిధుల స్వీకరణలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం ఉల్లంఘించిన వారికి క్లియరెన్స్ ఇవ్వడానికి కొందరు అధికారులు ముడుపులు స్వీకరించారని సీబీఐ ప్రకటించారు. కత్తెర సురేష్ నడుపుతున్న సంస్థ కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఫండ్స్ విదేశాల నుంచి తీసుకువచ్చినట్లుగా తేలడంతో కేసు నమోదు చేశారు.